రాజాజీ భవన్‌ వద్ద పోలీసుల హడావుడి | Delhi crime branch has reached Dinakaran's residence at Rajaji Bhavan | Sakshi
Sakshi News home page

రాజాజీ భవన్‌ వద్ద పోలీసుల హడావుడి

Published Fri, Apr 28 2017 8:06 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

Delhi crime branch has reached Dinakaran's residence at Rajaji Bhavan

చెన్నై: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు రెండో రోజు కూడా చెన్నైలో  విచారణ నిర్వహించారు. చెన్నైలోని మూడు ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న ఆయన్ను గురువారం చెన్నైకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు అడయార్‌లోని నివాసంలో ఆయన వద్ద విచారణ సాగింది. ఇదే కేసులో అరెస్టు అయిన దినకరన్‌ స్నేహితుడు మల్లికార్జున్‌ అన్నానగర్‌ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు.

శుక్రవారం ఈ ఇద్దర్నీ ఆంధ్రప్రదేశ్‌ లేదా, కేరళకు తీసుకెళ్లవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, రాజాజీభవన్‌లోని సీబీఐ కార్యాలయానికి ఆ ఇద్దర్నీ పరిమితం చేశారు. ఓ బృందం వీరి వద్ద విచారణ సాగించగా, మరో బృందం ఆదంబాక్కం వల్లలార్‌ వీధిలోని రిటైర్డ్‌ అధికారి మోహనరంగన్‌ ఇంటి వద్ద గంట పాటు విచారణ సాగింది. అలాగే పోరూర్‌లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్‌కు చేరుకుని ఆ ఇద్దరిని విచారణ చేపట్టారు. కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న హవాల ఏజెంట్‌ నరేష్‌ను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement