పనితీరు మెరుగుపర్చుకోండి: హైకోర్టు
Published Fri, Sep 13 2013 3:01 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
న్యూఢిల్లీ: నగరంలో చోటుచేసుకుంటున్న నేరాలను నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు తమ పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని హైకోర్టు సూచించింది. డిసెంబర్ 16 ఘటనలో దోషులుగా నిర్ధారించినవారికి కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ మీడియాలో ప్రసారమైన పలు కథనాలతో గతంలో సుమోటోగా కేసును స్వీకరించిన హైకోర్టు నగర పోలీసులకు పలు మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాము జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేశారా? లేదా? అనే విషయమై కోర్టు స్పందిస్తూ.. ‘మీరు(ఢిల్లీ పోలీసులు) మీ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరముంది’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ సూచించారు.
అంతేకాక పోలీసు సిబ్బందిలో ఉన్న ఖాళీల వివరాలను వెంటనే కోర్టుకు అందజేయాలని ప్రభుత్వ న్యాయవాది దాయన్ కృష్ణన్‌కు ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీసులతోసహా ఏఎస్‌ఐ, ఎస్‌ఐల ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలపాలని ఢిల్లీ పోలీసుశాఖను కోర్టు ఆదేశించింది. అంతేకాక ఏయే స్టేషన్లలో ఎవరెవరు అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారో తెలపాలని సూచించింది. కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.
Advertisement
Advertisement