‘ఎఫ్‌ఐఆర్’పై హైకోర్టుకు ఢిల్లీ సర్కారు
Published Tue, Sep 3 2013 10:33 PM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. 2008 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ ప్రచారం నిమిత్తం రూ. 11 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత విజేంద్ర గుప్తా, ఆర్‌టీఐ కార్యకర్త వివేక్ గార్గ్ స్థానిక లోకాయుక్తలో ఫిర్యాదుచేశారు. దీనిపై విచారించిన ఆ కోర్టు నిధుల దుర్వినియోగం విషయంలో సీఎం షీలాదీక్షిత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గత నెల 31న ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వెంకటరమణ, జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ బెంచ్‌ను ఆశ్రయించింది.
ఈ కేసు అత్యంత ముఖ్యమైంది కాబట్టి ఈ రోజే దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సిద్ధార్థ్ లూత్రా హైకోర్టును కోరడంతో మధ్యాహ్నం గం.2.15 ని.లకు విచారణకు స్వీకరించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రచారం నిమిత్తం అప్పటి ముఖ్యమంత్రి, ప్రచార శాఖకు ఇన్‌చార్జిగా ఉన్న షీలాదీక్షిత్ రూ.22.56 కోట్ల రూపాయలను వినియోగించారని బీజేపీ నేత విజేంద్ర గుప్తా స్థానిక లోకాయుక్తలో ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఈ ఏడాది మే 22న ఢిల్లీ లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరిన్ ముందు ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ ఎన్నికల సంవత్సరంలో షీలా ప్రభుత్వం దిన, వారపత్రికల్లో ముమ్మరంగా ప్రకటనలను జారీచేశారని తన ఫిర్యాదులో నివేదించారు.
అలాగే యూపీఏ చైర్‌పర్సన్ సోని యా గాంధీ, షీలాదీక్షిత్ ఫొటోలు ఉన్న పెద్ద పెద్ద హోర్డింగ్‌లను ఢిల్లీ మెట్రో, బస్ షెల్టర్లలో ఏర్పాటుచేశారని, రేడియో, టీవీల్లో సైతం ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రచారాలతో హోరెత్తించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం నిమిత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాగాా, దీనిపై విచారణ జరిపిన పిదప లోకాయుక్త తన ఫిర్యాదుతో ఏకీభవించినట్లు గుప్తా పేర్కొన్నారు. షీలాదీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, సదరు సొమ్ములో సగం అంటే సుమారు రూ.11 కోట్లను ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ గాని, ఆమె పార్టీగాని తిరిగి చెల్లించేలా హెచ్చరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లోకాయుక్త కోరినట్లు వివరించారు.
బీజేపీ నేతకు హైకోర్టు నోటీసులు
ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ‘ఎఫ్‌ఐఆర్’ కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు విజేంద్ర గుప్తా, సిటీ పోలీస్ కమిషనర్‌లకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. 2008 ఎన్నికలకు ముందు తమపార్టీ ఎన్నికల ప్రచార నిమిత్తం ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నేత విజేంద్ర గుప్తా ఢిల్లీ లోకాయుక్తను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన లోకాయుక్త పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. నిధుల దుర్వినియోగంపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేయాలని గత నెల 31న పోలీస్‌శాఖను ఆదేశించింది. కాగా, దీనిపై మంగళవారం ఢిల్లీ సర్కారు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ వాదనపై ఈ నెల 19లోగా స్పందించాలని బీజేపీ సీనియర్ నేత విజేంద్ర గుప్తా, సిటీ పోలీస్ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది.
Advertisement
Advertisement