ఎన్నికల్లో అవినీతి బిల్లుకు నో
Published Wed, Aug 28 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అవినీతిని కేసు పెట్టతగిన నేరంగా (కాగ్నిజబుల్ అఫెన్స్) గుర్తించేందుకు వీలు కల్పించేందుకు చట్టాన్ని రూపొందించాలన్న ఎన్నికల సంఘం కలనెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సానుకూలత వ్యక్తం చే యలేదు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై విముఖత వ్యక్తమయింది. ఎన్నికల్లో అవినీతి నిరోధానికి భారత శిక్షాస్మృతిలో ప్రస్తుతమున్న నిబంధనలు సరిపోతాయని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర హోంశాఖ ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలను గతంలోనే కోరింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు అవినీతికి పాల్పడితే దానిని కేసుకు అర్హమైన నేరంగా పరిగణించాలి. అయితే ప్రస్తుతం నియమాల ప్రకారం దీనిని కేసు పెట్టతగిన నేరంగా పరిగణించడం లేదు.
సోనియాకు అభినందనలు
ఆహార భద్రతా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంతో యూపీయే చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పార్లమెంటరీ సెక్రటరీ ముఖేష్ శర్మ ప్రవేశపెట్టిన అభినందన తీర్మానాన్ని ఢిల్లీ విధానసభ ఆమోదించింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి అతి తక్కువ ధరలకే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారని తీర్మానం తెలిపింది. ఇదిలా ఉంటే, ఉల్లి ధరలపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మండిపడింది. ధరల నియంత్రణకు తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని డిమాండ్ చేసింది. విధానసభ ఎదురుగా పలువురు సభ్యులు ఉల్లిదండలను మెడలో వేసుకొని నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం షీలా దీక్షిత్ కోట్లాది రూపాయల వ్యయంతో నగరవ్యాప్తంగా హోర్డింగులు ఏర్పాట చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ మాజీ కార్యదర్శి సునీల్ ఆధ్వర్యంలో జోర్‌బాగ్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు.
Advertisement