మరో రెండువారాల గడువు
Published Tue, Feb 25 2014 10:54 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయంపై దాఖలైన కేసులో కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతికి మరింత వెసులుబాటు లభించింది. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పరిమితి మించి ఖర్చు చేశారని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఇరువురిపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందించడానికి ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతికి మరో రెండువారాల గడువు ఇచ్చింది. తమ ఎన్నికను ఎందుకు రద్దు చేయకూడదో తెలుపుతూ రెండు వారాల్లోగా సంజాయిషీ ఇవ్వాలని న్యాయస్థానం కేజ్రీవాల్, భారతికి గతంలోనే నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గడువును మంగళవారం మరో రెండు వారాలు పొడిగించింది. కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతి ఎన్నికల ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేశారని, వారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా పిటిషన్లను దాఖలు చేశారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయం 14 లక్షల రూపాయలను మించకూడదు. అయితే కేజ్రీవాల్, భారతి ఎన్నికల వ్యయం రూ. 17లక్షలకు పైగా ఉందని, వారి ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌తో తలపడిన విజేందర్ గప్తా, మాలవీయ నగర్ నియోజకవర్గంలో సోమ్‌నాథ్ భారతికి వ్యతిరేకంగా పోటీచేసిన ఆర్తీ మెహ్రా ఈ పిటిషన్లను దాఖలు చేశారు. గుప్తా పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి విపిన్ గుప్తా మరో రెండువారాల్లో సంజాయిషీ ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆదేశిస్తూ కేసును మార్చ్ 17కి వాయిదావేశారు. ఆర్తీ మెహ్రా పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జి.ఎన్.సిస్తానీ కూడా సోమ్‌నాథ్ భారతికి రెండు వారాల గుడువు ఇచ్చారు.
ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీ నామా ప్రభావం ఈ పిటిషన్‌పై ఉంటుందా? అని న్యాయమూర్తి సిస్తానీ ఆరా తీశారు.
దానికి బీజేపీ తరపు న్యాయవాది జవాబిస్తూ ఇది ఎన్నికలకు సంబంధించి పిటిషన్ అని, ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రభావం కేసుపై ఉండబోదని చెప్పారు. రాజీనామా తరువాత కూడా కేసు కొనసాగుతుందని, తాము కేసు గెలిచినట్లయితే కేజ్రీవాల్, భారతి ఆరేళ్ల వరకు ఎన్నికలలో పోటీచేసే అవకాశాన్ని కోల్పోతారని ఆర్తీ మెహ్రా తరఫు న్యాయయవాది కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్, భారతి ఎన్నికల ప్రచారంలో నియమాలను ఉల్లంఘించారని, ఎన్నికల తేదీని ప్రకటించిన తరువాత జీత్ కీ గూంజ్, ఓట్ ఫర్ చేంజ్ పేరిట నిర్వహించిన రాక్ షోకు లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఈ ఖర్చును తమ ఎన్నికల వ్యయంలో పేర్కొనలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ గాయకులు, ప్రముఖులు పాల్గొన్నారని, వారికి ఒక్కొక్కరికి రూ.3.10 లక్షలు చెల్లించారని పిటిషనర్లు ఆరోపించారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం వార్తాపత్రికలలో ప్రటకనలు ఇచ్చారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
Advertisement