కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు
Published Tue, Jan 28 2014 10:58 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఎన్నిక చెల్లబోదని ప్రకటించాలని బీజేపీ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై మంగళవారం స్పందించిన ఢిల్లీ హైకోర్టు వీళ్లిద్దరికీ నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భార తి ఎన్నికల వ్యయం 14 లక్షల రూపాయల వ్యయపరిమితిని మించిపోయిందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ ఇరువురు నేతలు లేదా ఆమ్‌ఆద్మీ పార్టీ ఫిబ్రవరి 25లోగా ఈ పిటిషన్లపై సంజాయిషీ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయిన రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా ఆయన ఎన్నికల వ్యయంపై కేసు దాఖలుచేశారు. మాలవీయనగర్ స్థానంలో భారతి చేతిలో ఓడిన బీజేపీ నేత ఆర్తీమెహ్రా మంత్రికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. గుప్తా ఫిర్యాదుపై న్యాయమూర్తి విపుల్ సింఘ్వీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేయగా, మెహ్రా పిటిషన్‌పై న్యాయమూర్తి జీఎస్ సిస్థానీ న్యాయశాఖ మంత్రికి నోటీసు జారీ చేశారు. కేజ్రీవాల్, భార తి ఎన్నికల ప్రవర్తనా నియమావళితోపాటు ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సంగీత విభావరి కోసం ఆప్ రూ.39 లక్షలు ఖర్చు చేసిందని పిటిషనర్లు ఆరోపించారు. గాయకుడు విశాల్ దడ్లానీతోపాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతి, ఆర్కేపురం అభ్యర్థి షాజియా ఇల్మీ హాజరయ్యారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ విభావరికి చెల్లించిన 39 లక్షల రూపాయలను ముగ్గురు అభ్యర్థులు సమంగా భరించారని పేర్కొన్నారు. అంటే కేవలం ఈ ఒక్క కార్యక్రమం కోసమే ముగ్గురూ రూ.13 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తేలుతోందని బీజేపీ వివరించింది. ఈ విభావరిలో పాల్గొన్న గాయకులు తమ నుంచి డబ్బు తీసుకోలేదని, బీజేపీ ఆరోపణలు నిరాధారమైనవ ని ఆప్ వర్గాలు అంటున్నాయి.
Advertisement