న్యూఢిల్లీ: కేజ్రీవాల్ హామీ మేరకు విద్యుత్ బిల్లులను చెల్లించకుండా వదిలేసిన వారికి ఇది చేదు కబురు. ఆయన హామీ ఇచ్చినట్టు బిల్లులపై 50 శాతం రాయితీ ఇవ్వడం కుదరదని ప్రభుత్వం హైకోర్టుకు గురువారం తెలిపింది. రాయితీల మంజూరుకు సంబంధిత ప్రభుత్వ విభాగం నిధులు కేటాయించలేదని పేర్కొంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేయడం సాధ్యం కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలోని బెంచ్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. బిల్లుల ఎగవేతదారులకు రాయితీలు ఇవ్వొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ విషయం తెలిపారు. దీంతో బెంచ్ ఈ కేసును కొట్టివేసింది. అయితే ప్రభుత్వం వీరికి రాయితీ ఇవ్వాలని భవిష్యత్‌లో నిర్ణయిస్తే..దానిపై విభేదిస్తూ తిరిగి కోర్టుకు రావొచ్చని పిటిషనర్ వివేక్ శర్మకు బెంచ్ సూచించింది.
కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని ఆరోపిస్తూ ఆప్ 2012లో భారీ ఆందోళనలు నిర్వహించడం తెలిసిందే. విద్యుత్ పంపిణీ సంస్థలు దురాశతో భారీ బిల్లులు పంపుతున్నాయని ఆరోపించారు. ఏటా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా, నష్టాలు ఉన్నామంటూ అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు 2012 అక్టోబర్ నుంచి 2013 డిసెంబర్ వరకు పలువురు కరెంటు బిల్లులు చెల్లించలేదు. వీరికి రాయితీ కోసం రూ.6.82 కోట్లు విడుదల చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆప్ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. బిల్లుల ఎగవేతదారులను ప్రోత్సహించేలా రాయితీలు ఇవ్వకూడదని రాష్ట్ర న్యాయవిభాగం కూడా కోర్టులో వాదించింది.
విద్యుత్ బిల్లులపై 50 శాతం రాయితీ కుదరదు
Published Thu, May 22 2014 10:54 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement