వికలాంగులకు ‘మెట్రో’వర్క్‌షాప్
Published Thu, Apr 24 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రోరైలులో ప్రయాణంతోపాటు ప్రత్యేకంగా కల్పిస్తున్న సదుపాయాలపై వికలాంగులకు అవగాహన కల్పించేందుకు ఢిల్లీ మెట్రోమ్యూజియం అధికారులు ఓ వర్క్‌షాప్ నిర్వహించారు. బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వికలాంగులు పాల్గొన్నారు. మెట్రోరైళ్లలో వికలాంగులకు కల్పిస్తున్న సదుపాయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. మెట్రోస్టేషన్లు, రైళ్లలో సదుపాయాలతోపాటు ఎలా ప్రవర్తించాలన్నది వివరిస్తూ ఓ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
పేరణ నికేతన్ సంఘ్ ఎన్‌జీఓ సంస్థ సహకారంతో ఈ వర్క్‌షాప్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రాయింగ్ పోటీల్లో వికలాంగులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎంఆర్‌సీ ఫైనాన్స్ డెరైక్టర్ కె.కె.సబర్వాల్ పాల్గొన్నారు. వికలాంగులకు మెట్రోస్టేషన్లలో వీల్‌చైర్లు, దృష్టి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వికలాంగులకోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీ మెట్రోమ్యూజియం ఆధ్వర్యంలో వికలాంగులు, కేన్సర్ బారిన పడిన చిన్నారులకోసం ఏటా డ్రాయింగ్, క్విజ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement