నగరవాసులకు మరో కానుక | Delhi Metro's Mandi House-Central Secretariat line opens | Sakshi
Sakshi News home page

నగరవాసులకు మరో కానుక

Published Thu, Jun 26 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

నగరవాసులకు మరో కానుక

నగరవాసులకు మరో కానుక

సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ మధ్య  3.2 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మెట్రోరైలు చార్జీల పెంపు ప్రతిపాదనపై అధ్యయనం చే సి చార్జీల సవరణకుఅవకాశం ఉందేమో చూడాల్సిందిగా డీఎమ్మార్సీని కోరినట్లు మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
 
 సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మండీహౌజ్-సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో లైన్ గురువారం ప్రారంభమయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు దీనిని ప్రారంభించారు. మహిళా డ్రైవరుతో కూడిన మొదటి రైలును ఉదయం 9.30 గంటలకు మండీహౌజ్ స్టేషన్‌లో జెండా ఊపి ఈ లైన్‌ను ప్రారంభించారు. ఆ తరువాత డీఎంఆర్‌సీ  మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్, ఇతర సీనియర్ అధికారులు, విలేకరులతోపాటు వెంకయ్యనాయుడు మెట్రోరైలులో ప్రయాణించి సెంట్రల్ సెక్రటేరియట్ చేరుకున్నారు.  గురువారం మధ్యాహ్నం నుంచి ఈ మార్గంలో మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో రెండోదశలో నిర్మించిన బదర్‌పుర్ కారిడార్‌ను కశ్మీరీగేట్ వరకు పొడిగించడానికి సెంట్రల్‌సెక్రటేరియట్ నుంచి కశ్మీరీ గేట్ వరకు కిలోమీటర్ల మెట్రోలైన్ నిర్మించారు.
 
 ఇందులో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ మధ్య  3.2 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గాన్ని భూగర్భంలో నిర్మించారు. ఈ మార్గంలో సెంట్రల్ సెక్రటేరియట్, జన్‌పథ్, మండీహౌజ్ స్టేషన్లు ఉన్నాయి. మే 2011లో  ప్రారంభించిన ఈ మెట్రో లైన్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువుకు మూడు నెలల ముందే ముగించినట్లు ఢిల్లీ మెట్రో చెప్పింది. బదర్‌పుర్ కారిడార్‌ను (వయొలెట్ లైన్) పొడిగిస్తూ నిర్మించిన ఈ సెక్షన్ వల్ల రాజీవ్‌చౌక్ స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి తగ్గుతుంది. బదర్‌పుర్-సెంట్రల్ సెక్రటేరియట్ మార్గంలో ప్రయాణికులు దక్షిణ ఢిల్లీ నుంచి నోయిడా, ద్వారకా, వైశాలి వెళ్లేందుకు ఇక నుంచి రెండురైళ్లు మారనవసరం లేదు. అంతకు ముందు ఈ రూట్లో ప్రయాణించేవారు సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్‌లో, రాజీవ్‌చౌక్ స్టేషన్‌లో రైళ్లు మారవలసి వచ్చేది. ఈ సెక్షన్ ప్రతిరోజూ 70 వేల మంది ప్రయాణికులుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.  
 
 ఇక నుంచి తరచూ మెట్రో ప్రయాణం: మంత్రి వెంకయ్యనాయుడు
 ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మండీహౌజ్ కారిడార్ నిర్మాణ పనులను విజయవంతంగా ముగించిన ఢిల్లీ మెట్రో అధికారులు, ఢిల్లీ ప్రభుత్వాన్ని, కార్మికులను అభినందించారు. 140 కిలోమీటర్ల మెట్రోమార్గంతో మెట్రోఫేజ్  3 నిర్మాణం మొత్తం పూర్తయితే దేశరాజధానిలో ప్రయాణం తీరుతెన్నులు మారుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ జీవితంలో వేగవంతమైన, సౌకర్యంగా ఉండే ప్రయాణ సాధనం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సెంట్రల్ సెక్రటేరియట్-మండీహౌజ్ సెక్షన్‌లోని స్టేషన్ల గోడలు ఈ ప్రాంతపు చారిత్రక నేపథ్యాన్ని కనుల ముందుంచుతున్నాయని వ్యాఖ్యానించారు. మెట్రోఫేజ్ 3లో 13 ఇంటర్‌చేంజ్ స్టేషన్లు ఉన్నాయి.
 
 వీటి నిర్మాణం 2016 మార్చి నాటికి పూర్తికానుంది. అప్పటి వరకు ఢిల్లీలో చాలా భాగం మెట్రోతో అనుసంధానిస్తామని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చే శారు. దూరప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు దేశరాజధానిలో  ప్రయాణించడానికి మెట్రో సదుపాయాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతూ తన మంత్రివర్గ సహచరులందరికీ లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు.  ఇది కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందన్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా తాను మెట్రో రైలులో ప్రయాణిస్తానని వెంకయ్య ఈ సందర్భంగా అన్నారు. దాని వల్ల మెట్రో పనితీరు గురించి స్వయంగా తెలుసుకోవడంతోపాటు రోడ్లపై రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడగలుగుతానని చెప్పారు.
 
 చార్జీల పెంపుపై త్వరలోనే నిర్ణయం
 పెండింగులో ఉన్న మెట్రో చార్జీల పెంపును గురించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, చార్జీల పెంపు ప్రతిపాదనను అధ్యయనం చే సి చార్జీల సవరణకుఅవకాశం ఉందేమో చూడాల్సిందిగా డీఎమ్మార్సీని కోరినట్లు ఆయన చెప్పారు. చమురు, ఇతర ధరలు పెరిగినప్పుడు వ్యయభారం సమస్యను పరిష్కరించడానికి రెండు మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి ప్రయాణికులపై పెరిగిన వ్యయభారాన్ని మోపడం, రెండోది.. వాణిజ్య ప్రకటనలు, ఫుడ్‌కోర్టుల వంటి వాటి ఏర్పాటుకు మెట్రో స్టేషన్ల ప్రాంగణాలను సమర్థంగా వాడుకోవడమని చెప్పారు. మెట్రోఫేజ్ 3 ప్రాజెక్టుల కోసం భూసేకరణ గురించి లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడానని వెంకయ్య నాయుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement