మళ్లీ సరి-బేసి విధానం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు ప్రకటించిన సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి తర్వాత రాజధాని నగరంలో కమ్ముకున్న కాలుష్యవాయువులను తొలగించేందుకు అత్యవసర కేబినేట్ భేటీని ఆదివారం నిర్వహించింది.
సరి-బేసి రవాణా విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణాల పనులను నిలిపివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నగరంలో జనరేటర్ల వినియోగంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. కాలుష్యం విషయంలో రాజకీయాలను వదిలిపెట్టి పరిష్కార మార్గాన్ని వెతకాలని అన్నారు.
నిపుణుల సూచనల మేరకు కొన్ని అత్యవసర నిర్ణయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు. దక్షిణ ఢిల్లీలో గల బొగ్గు ఆధారిత విద్యుత్తు తయారీ కేంద్రాన్ని 10 రోజుల పాటు మూసివేయనున్నట్లు వెల్లడించారు. ప్లాంటు నుంచి వెలువడే యాష్ పై నీటిని చిలకరించాలని చెప్పారు. అలాగే రోడ్లపై కూడా నీటిని చల్లనున్నట్లు తెలిపారు. నగర వాసులందరూ ఇంటి నుంచే తమ కార్యకలాపాలను సాగించుకోవాలని సూచించారు.
ఈ నెల 10వ తేదీ నుంచి పీడబ్ల్యూ శాఖ కాలి నడక వంతెనలపై దుమ్ము, ధూళిని వ్యాక్యూమ్ క్లీనర్ల ద్వారా శుద్ది చేస్తుందని చెప్పారు. డీజిల్ జనరేటర్లను ఉపయోగించే వారు విద్యుత్తు కనెక్షన్ ను కోరితే అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఢిల్లీని కప్పివేసిన పొగ సోమవారం తర్వాత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో గాలి వేగం నెమ్మదించడంతో పాటు గాలిలో తేమ అధికంగా ఉండటమే పొగ ఇన్ని రోజులు నిలిచి ఉండటానికి కారణమని చెప్పారు.