డీయూ ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత
సాక్షి, న్యూఢిల్లీ:‘‘ నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉన్న నా భర్తను హత్య చేయడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారు. ఆయనకు పౌష్టిక ఆహారం ఇవ్వడం లేదు. మందులు, వైద్యసేవలు అందించడం లేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి’’ అని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా భార్య వసంత విన్నవించారు. సాయిబాబాను జైలు నుంచి విడిపించడానికి మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటైన కమిటీ సభ్యులతో కలసి వసంత గురువారం ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజ్యహింసలో భాగంగా జుడీషియల్ కస్టడీలో ఉన్న తన భర్తను భౌతికంగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన సాయిబాబాను సంఘవిద్రోహకుడిగా చిత్రీకరించి ఏడాది క్రితం అరెస్టు చేసి నాగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అన్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకూడదని సీఆర్‌పీసీ సెక్షన్ చెబుతోందని కానీ, దానిని ఉల్లంఘించి సాయిబాబాను జైలు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన మానవ హక్కుల కమిషన్‌లు అధికారపక్షం చేతిలో పతనమయ్యాని విమర్శించారు. సాయిబాబా బెయిలుపై విడుదల కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
సాయిబాబా తల్లి సూర్యావతి మాట్లాడుతూ ఆదివాసీల బాగుకోసం పనిచేసిన తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. సామాజికవేత్త అరుంధతిరాయ్, డీయూ ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాపై ప్రభుత్వం కక్షకట్టిందని చెప్పారు. ఊచకోతలు, హత్యలు, కరుడుకట్టిన నేరస్తులు దర్జాగా బెయిల్‌పై బయట తిరుగుతుండగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాకు బెయిల్ ఇవ్వకపోవడం మానవహక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
జైలులో నా భర్త హత్యకు కుట్ర
Published Fri, Apr 24 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement