న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు.
‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్‌పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్‌కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది.
Comments
Please login to add a commentAdd a comment