న్యూఢిల్లీ:నగరంలో ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లను కలిపి ఒకే కార్పొరేషన్‌గా మారిస్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని కొత్తగా ఎన్నికైన మేయర్లు భావిస్తున్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే తమ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు వారు యోచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఢిల్లీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన యోగేంద్ర ఛండోలియా ఈ ప్రతిపాదన పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీ పెద్దలను కలిసి దీనిపై చర్చిస్తామని చెప్పారు. ‘ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయమై మేం ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. దేశ రాజధానిలో ఇకపై మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండకూడదనేదే మా లక్ష్యం..కాని ఢిల్లీ ప్రభుత్వం మాత్రం మూడు కార్పొరేషన్లు ఉండాలనే మొండి పట్టుదలతో ఉంది..’ అని యోగేంద్ర వ్యాఖ్యానించారు.
యోగేంద్ర 2010-12 వరకు రెండు పర్యాయాలు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ)లో స్థాయీ సమితి చైర్మన్‌గా పనిచేశారు. ఎంసీడీని అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించి నగరవాసులపై తీవ్ర భారం మోపిందని విమర్శించారు. ‘నా ఉద్దేశంలో నగరంలో ఒకే కార్పొరేషన్ ఉండాలి.. దాని కోసం పార్టీలో చర్చిస్తా.. మా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏకీకృత కార్పొరేషన్ కోసం నా వంతు కృషిచేస్తా..’ అని చెప్పారు. న్యూఢిల్లీ కార్పొరేషన్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన విమర్శించారు. వనరుల కేటాయింపుల్లోనూ అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత చాలా ప్రాజెక్టులకు నిధులు లేక ఆగిపోయిన పరిస్థితి.. అలాగే చాలా సమస్యలపై స్పందించేందుకు పటిష్టమైన విధానాలు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రంథాలయాలకైనా నిధులు కేటాయించడం దుర్లభంగా మారిపోయిందని ఆయన విమర్శించారు.
పాతఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఉన్న ప్రసిద్ధ హార్డింగ్ లైబ్రరీ (ప్రస్తుత హర్‌దయాల్ లైబ్రరీ)కి నగరవ్యాప్తంగా శాఖలకు వనరుల కేటాయింపుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన ఉదహరించారు. అలాగే నగరంలోని చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రస్తుతం పింఛన్లు పొందడంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒకే ఎన్‌ఎండీ ఉంటే ఈ ఇబ్బందులన్నీ ఉండేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తూర్పు ఢిల్లీ మేయర్ మీనాక్షి సైతం చందోలియా అభిప్రాయంతో ఏకీభవిస్తూ జాతీయ రాజధానికి ఒకే కార్పొరేషన్ ఉండాలని స్పష్టం చేశారు. విభజన వల్ల సమస్యలు మూడింతలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. ఒకే నగరానికి మూడు రకాలైన విధానాలను అమలు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు.
అయితే దక్షిణ ఢిల్లీ మేయర్ ఖుషీరామ్ మాత్రం భిన్నంగా స్పందించారు. తన పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తానని చెప్పారు. ఏకీకృత ఎంసీడీపై ఆయన పెద్దగా స్పందించలేదు. దక్షిణ ఢిల్లీ మేయర్ పదవిని ఒకే ఒక ఓటుతో గెలుపొందింది. ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో బీజేపీ మేయర్ స్థానాన్ని దక్కించుకోగలిగింది. కాగా, విభజన వల్ల కూడా కొంతమేర ఉపయోగాలున్నాయని మీనాక్షి అంగీక రించారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో కమిషనర్లను స్థానిక ప్రజలు కలుసుకోవడానికి సులభతరమైందన్నారు.
ఇదిలా ఉండగా, నగరంలో పరిశుభ్రత,ఆరోగ్యం, విద్య తమ ప్రాధాన్యాలుగా ముగ్గురు మేయర్లూ స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. నగరంలో పార్కులను సుందరంగా తీర్చిదిద్ది అందమైన ఢిల్లీని తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు ఢిల్లీలోని అనధికార కాలనీల పరిస్థితులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు మీనాక్షి వివరించారు. ఇదిలా ఉండగా, గత ఏడేళ్లుగా ఎంసీడీలో బీజేపీయే అధికారంలో ఉంది. కాగా, మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
కలిసుంటేనే మంచిది!
Published Sun, May 4 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement