న్యూఢిల్లీ:కేవలం అహం కారణంగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంసీడీని మూడు కార్పొరేషన్లుగా విభజించారని, దీనిని రద్దు చేయాలని ఢిల్లీ బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనను పంపించాలని బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్లు భావిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ బుధవారం నిర్వహించే సమావేశంలో ఈ అంశంపై చర్చ నడిచే అవకాశముంది. ఎంసీడీ విభజన తరువాత నిధుల లేమి వల్ల కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టునూ చేపట్టలేకపోతున్నామని మేయర్లు అంటున్నారు. అందుకే విభజన రద్దుకు పోరాటం చేస్తామని చెబుతున్నారు. ‘టోల్‌ట్యాక్స్ వసూలు, ఈ-గవర్నెన్స్ వంటి విభాగాలు ఇప్పటికీ ఒకటిగానే ఉన్నాయి. ఎంసీడీని ఏకం చేయడంపై ప్రజల అభిప్రాయాలు కోరి తుది నిర్ణయం తీసుకోవాలి. విభజన వల్ల ఢిల్లీవాసులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు’ అని దక్షిణఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభా నాయకుడు సుభాష్ ఆర్య అన్నారు. ఎంసీడీని విడగొట్టడం వల్ల ఈ-గ వర్నెన్స్ పాలన ప్రాజెక్టు ఇప్పటికీ ప్రారంభం కాలేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ‘ప్రతి దానికీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంతకుముందున్న ఎంసీడీ ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా నిధుల కొరత వల్ల పూర్తి కాలేదు’ అని ఉత్తరఢిల్లీ మేయర్ యోగేందర్ చందోలియా అన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) విభజనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినా షీలా దీక్షిత్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. ఢిల్లీ అభివృద్ధికి ఒకే మున్సిపల్ కార్పొరేషన్ ఉండడం మేలన్నది తన నిశ్చితాభిప్రాయమని చందోలియా స్పష్టీకరించారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి మేయర్లకు సర్వాధికారాలు ఉంటాయన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే తాను ఈ విషయంపై చర్చిస్తానన్నారు. ‘ఎంసీడీ విభజన గురించి మా పార్టీ మేనిఫెస్టోలోనూ ఉంది. కానీ అది పార్టీ నిర్ణయం కాబట్టి దానిని అనుసరించాల్సిందే. విభజనను రద్దు చేయాలని నా తరఫున పోరాడుతాను. విభజన వల్ల ఎంసీడీ ఉద్యోగులు కూడా చాలా నష్టపోయారు. చాలా ప్రాజెక్టులకు ఏకీకృత ఎంసీడీ సమయంలో ఆమోదం లభించింది. సంస్థ విడిపోయిన తరువాత ప్రాజెక్టుల్లో ఏర్పడిన సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు హర్‌దయాళ్ గ్రంథాలయం పాత ఢిల్లీలోని చాందినీచౌక్‌లో ఉంటుంది.
దాని శాఖలు ఎంసీడీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. దీనివల్ల నిధుల కేటాయింపుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా మంది ఉద్యోగులకు పింఛన్లు సరిగ్గా అందడం లేదు. విభజన లేకుంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయి ఉండేది కాదు’ అని చందోలియా అన్నారు. ఈయనకు ముందు మేయర్‌గా వ్యవహరించిన బీజేపీ నాయకుడు ఆజాద్‌సింగ్ స్పందిస్తూ బీజేపీ విజయం ఎంసీడీకి శుభసూచకమని అభిప్రాయపడ్డారు. యూపీయే ప్రభుత్వం ఎంసీడీపై సవతి తల్లి ప్రేమచూపిందని ఆరోపించారు. అప్పటి నాయకుల వల్ల నిల్చిపోయిన పనులన్నీ త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ‘ఇంతకుముందే మేం ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఇప్పుడైతే మేం హోంశాఖను కూడా సంప్రదించవచ్చు. ఎంసీడీ విభజన రద్దుకు సిఫార్సు చేయవచ్చు’ అని అన్నారు.
విభజన రద్దే మేలు : మీనాక్షి
జాతీయ రాజధానిగా ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఉండడమే మేలని పశ్చిమఢిల్లీ మేయర్ మీనాక్షి అన్నారు. ఈ విషయంలో తాను చందోలియాతో ఏకీభవిస్తానని తెలిపారు. విభజన వల్ల సమస్యలు మూడురెట్లు పెరిగాయని ఆమె విమర్శించారు. ఒకే నగరానికి మూడు విధానాలు ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు. విభజన వల్ల నిధులు లేక పశ్చిమఢిల్లీ కార్పొరేషన్ చాలా ఇబ్బందులు పడుతున్నదని తెలిపారు. ఇంటి పన్ను వసూళ్లలో ఇతర కార్పొరేషన్ల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. ఎంసీడీ విభజన ఏకపక్షంగా జరిగిందని, దీనిని రద్దు చేయాలని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఏర్పడే ప్రభుత్వాన్ని కోరతామని ఆమె ఈ సందర్భంగా అన్నారు.
ఒకటే ఎంసీడీ..
Published Tue, May 20 2014 11:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement