గుర్గావ్ అభివృద్ధికి మేయర్ కృషి చేయాలి
Published Tue, Sep 3 2013 12:25 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
గుర్గావ్: నగరాన్ని అభివృద్ధి చేసేందుకు గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ నడుం బిగించాలని స్థానికులు కోరుతున్నారు. అభివృద్ధితో పాటు పరిపాలన సంబంధ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు మేయర్ కృషి చేయాలని గుర్గావ్ ఫస్ట్ అనే ఎన్జీవో ఆదివారం నిర్వహించిన ‘ఉత్తమ పాలన కోసం సాధికారత దిశగా స్థానిక సంస్థలు’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇందులో మిషన్ గుర్గావ్ డెవలప్‌మెంట్, క్లీన్ గుర్గావ్ గ్రూప్, ఐ యామ్ గుర్గావ్, వీ ద పీపుల్, గుర్గావ్ సిటిజన్ కౌన్సిల్, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
వీరు నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు కార్పొరేషన్ అనుసరించాల్సిన పద్ధతులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్పొరేషన్ పారదర్శకత పాలన లేకపోవడం, వివిధ స్థానిక సంస్థలు సరిగా పనిచేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇలా అయితే మన నగరాన్ని ప్రధాన నగరాల సరసన నిలపడం కష్టసాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇందుకోసం కార్పొరేషన్ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు మేయర్ కృషి చేయాలని కోరారు. గుర్గావ్-మానేసర్ మాస్టర్ ప్లాన్ 2031తోపాటు పరిపాలన సంబంధ వ్యవహారాల్లో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం సిటిజన్ గ్రూప్‌లు కలిసి పని చేయడంపైనా కూడా చర్చ జరిగిందని గుర్గావ్ ఫస్ట్ సభ్యుడు ఒకరు తెలిపారు.
పస్తుతమున్న క్రమబద్ధీకరించని ప్రైవేట్ బిల్డర్‌లు, బహుళ సంస్థలు స్థానికులపై ఎక్కవ భారం మోపుతున్నాయని, అయితే ఇవి కార్పొరేషన్‌కు జవాబుదారీతనంగా పనిచేయడం లేదని కౌన్సిలర్ నిషా సింగ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని ఆమె చెప్పారు. ‘గుర్గావ్‌లో అభివృద్ధి, దానికి సంబంధించిన ప్రణాళికలపై కార్పొరేషన్ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క శానిటేషన్‌లోనే కాకుండా అన్ని రకాల సమస్యలపై దృష్టి కేంద్రీకరించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల’ని మిషన్ గుర్గావ్ డెవలప్‌మెంట్ వ్యవస్థాపక సభ్యుడు భవాని శంకర్ త్రిపాఠి పేర్కొన్నారు. దీనికిదే మంచి తరుణమని అభిప్రాయపడ్డారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి స్పాన్సరర్‌గా వ్యవహరించిన డాటాసర్వ్ ఏపీఏసీ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ అమిత్ సర్దానా మాట్లాడుతూ తమ కంపెనీ గుర్గావ్ వాసులకు మంచి సేవలందిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి వ్యర్థపదార్ధాలను సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నామని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 208 28 28కు స్థానికులు కాల్ చేస్తే వెంటనే తమ కంపెనీ సిబ్బంది అక్కడికి చేరుకొని వ్యర్ధ పదార్థాలను సేకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సెక్టార్ 51లో అతిథ్యమిచ్చిన అర్టెమిస్ హాస్పిటల్ అధికారి ఒకరు మాట్లాడుతూ నగరవాసులకు సేవలందించేందుకు అర్టిమిస్ ఫౌండేషన్‌ను నెలకొల్పామన్నారు. పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అత్యాచారానికి గురైన ఐదు, 13 ఏళ్ల బాలికలను దత్తత తీసుకున్నామని వివరించారు.
Advertisement