విస్తరిస్తున్న డెంగీ
Published Tue, Sep 3 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
న్యూఢిల్లీ: నగరాన్ని డెంగీ గడగడలాడిస్తోంది. ఒక్క ఆగస్టు నెలలోనే రోగుల సంఖ్య 11 నుంచి 142 వరకు చేరుకుంది. దీన్నిబట్టి ఈ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతోంది. దీన్ని అరికట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్‌లు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. జూలై వరకు 11 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత దీని సంఖ్య 142 వరకు చేరిందని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వాతావరణంలో మార్పులు, తరచూ కురిసిన వర్షాలు, భవన నిర్మాణాల వద్ద పెరిగిన దోమల వల్ల ఈ డెంగీ ప్రభావం పెరిగిందని పేర్కొంది.
సాధారణంగానైతే సెప్టెంబర్‌లో డెంగీ కేసులు పెరుగుతాయని, అయితే ఈసారి గత నెలలో తరచూ కురిసిన వర్షాల వల్ల ముందే దీని ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉష్ణోగ్రత నిలకడగా ఉండటం, దోమలు పెరగడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతోందని ఉత్తర, తూర్పు ఢిల్లీ ప్రజా సంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ విలేకరులకు తెలిపారు. జనవరి నుంచి జూలై వరకు కేవలం 20 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. మార్చి నుంచి మే వరకు ఒక్క కేసు కూడా లేదని చెప్పారు. అయితే జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 152 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఇతర రాష్ట్రాల్లో పది కేసులు నమోదయ్యాయని వివరించారు. ఉత్తర ఢిల్లీలో 90, దక్షిణ ఢిల్లీలో 36, తూర్పు ఢిల్లీలో 13, ఢిల్లీ వెలుపల ప్రాంతాల్లో 13 కేసులు నమోదయ్యాయని గణాంకాలను వెల్లడించారు. ఉత్తర పరిధిలోని రోహిణిలో 31, నరేలాలో 32 కేసులను గుర్తించామని తెలిపారు. జూలైలో 18 ఉన్న మలేరియా రోగుల సంఖ్య 24కి చేరుకుందన్నారు.
ఈ వ్యాధులను నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. దోమలు ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంత భవనవాసులకు లీగల్ నోటీసులు జారీ చేశామన్నారు. పరిశుభ్రతను పాటించాలని కోరామన్నారు జనవరి నుంచి ఇప్పటివరకు 79,738 నోటీసులను పంపించామని చెప్పారు. ఈ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ఇంటి ఇంటికి వెళ్లి తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. ‘యమూనా నదీ తీర ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో చేపలను కూడా వదిలాం. అవి దోమలను తింటాయి. రోజువారీ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం. వ్యాధుల గురించి ప్రజల్లో జాగృతిని కల్పిస్తున్నాం. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నామ’ని చెప్పారు. వాతావరణంలో మార్పుల వల్ల దోమల సంఖ్య పెరుగుతుందన్నారు. నీరు నిలుచుని ఉండే ప్రాంతాలతో పాటు రైళ్ల ట్రాక్‌ల వెంబడి పొగను చల్లుతున్నామని ఆయన వివరించారు.
Advertisement
Advertisement