
ఓటుహక్కును కాలరాస్తారా?
హోటళ్లు, క్యాంటీన్లు, కార్పొరేట్ కార్యాలయాలపై బీఎంసీ చర్యలు
సాక్షి, ముంబై: పోలింగ్ రోజు కూడా సెలవు ఇవ్వకుండా సిబ్బందితో పనిచేయించి, వారి ఓటుహక్కు కాలరాసిన హోటళ్లు, షాపింగ్ మాల్స్, క్యాంటీన్లు, కార్పొరేట్ కార్యాలయాలు ఇలా 280 సంస్థల నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు బీఎంసీ రంగం సిద్ధం చేసింది. శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం బుధవారం పెయిడ్ లీవ్‌గా ప్రకటించింది. అలా వీలుకానిపక్షంలో రెండు గంటలు రాయితీ లేదా ఆఫ్ డే లీవ్ ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ నగరంలోని హోటళ్లు, క్యాంటీన్లు, షాపులు, కొన్ని కార్పొరేట్ కార్యాలయాలు తెరిచే ఉన్నాయి.
దీని కారణంగా అందులో పనిచేసే కార్మికులు, ఇతర సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇలాంటి సంస్థలపై దృష్టి సారించేందుకు బీఎంసీ ప్రత్యేకంగా నగరంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బృందాలకు 82 ఫిర్యాదులు వచ్చాయి. వీరిచ్చిన ఫిర్యాదులపై ఆధారపడకుండా అదనపు కమిషనర్ వికాస్ ఖర్గే, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర బలే నేతృత్వంలో బీఎంసీలోని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ డిపార్ట్‌మెంట్, కార్మికశాఖ కమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులు సంయుక్తంగా 2,706 సంస్థలపై నిఘా పెట్టారు.
అందులో 2,426 సంస్థల్లో కార్మికులకు రెండు గంటలు లేదా సగం రోజు సెలవు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ విభాగానికి చెందిన చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఎ.డి.గోసావి చెప్పారు. చర్యలు తీసుకున్న 280 సంస్థల్లో 83 షాపులు, 186 కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, 11 క్యాంటీన్లు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బందికి ఉదయం నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఓటు వేసేందుకు ఎలాంటి సౌకర్యం కల్పించలేదని స్పష్టమైంది. దీంతో ఆయా సంస్థల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.