అన్‌లాక్‌ ఇలా.. | Unlock 1 Guidelines For Opening Of Hotels Restaurants Malls | Sakshi
Sakshi News home page

అన్‌లాక్‌ ఇలా..

Published Sun, Jun 7 2020 3:04 AM | Last Updated on Sun, Jun 7 2020 9:00 AM

Unlock 1 Guidelines For Opening Of Hotels Restaurants Malls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాధారణంగా ఏదైనా రెస్టారెంట్‌కు కుటుం బంతో కలసి వెళ్లినప్పుడు మనం ఏం చేస్తాం? మెనూ కార్డు తీసుకొని ఆర్డర్‌ ఇచ్చేందుకు ఇంటిల్లిపాదీ దాన్ని తరచితరచి చూస్తాం. ఆపై మనం పక్కనపెట్టిన కార్డును పక్క టేబుల్‌పై ఉన్న కస్టమర్లకు వెయిటర్లు ఇవ్వడమూ చూస్తుంటాం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇకపై మెనూ కార్డు చేతులు మారే పరిస్థితికి తెరపడనుంది. ప్లాస్టిక్‌ మెనూ కార్డు స్థానంలో డిస్పోజబుల్‌ (ఒకసారి వినియోగించి పారేసే) మెనూ కార్డు దర్శనమివ్వనుంది. వీలైతే కాంటాక్ట్‌లెస్‌ ఆర్డర్‌ల విధానం అమల్లోకి రానుంది. హోటళ్లు, రెస్టారెంట్లలోని ఏసీల్లో ఉష్ణోగ్రత కేవలం 24–30 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం కానుంది.

హోటళ్లు, షాపింగ్‌ మాళ్లను సందర్శించే వినియోగదారుల కోసం ఈ మేరకు కొత్త నిబంధనలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 80 రోజు లుగా మూతపడిన వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాళ్లను ఈ నెల 8 నుంచి తిరిగి తెరిచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలింపుల మార్గదర్శకాలను ప్రకటించింది. షాపింగ్‌ మాళ్లు, వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు కేటగిరీలవారీగా నిబంధనలు విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. సుదీర్ఘ విరామం తర్వాత తెరుస్తున్నందున ముందుగా శానిటైజేషన్‌ చేశాకే ఉద్యోగులు, సిబ్బందిని లోనికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే...
కరోనా వ్యాప్తిని నిలువరించడంలో కీలకమైన భౌతికదూరం పాటించడంతోపాటు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, ఏవైనా వస్తువులు తాకినప్పుడు లేదా పనికి ముందు, తర్వాత తప్పకుండా చేతులను శానిటైజర్‌/హ్యాండ్‌వాష్‌/సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రపర్చుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతి వాణిజ్య కార్యాలయం, హోటల్, రెస్టారెంట్, షాపింగ్‌ మాల్‌లో యాజమాన్యం, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని, వినియోగదారులను తాకకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలని, జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కేటగిరీలవారీగా కేంద్రం మార్గదర్శకాలు ఇవీ...

హోటళ్లు, అనుబంధ యూనిట్లు...
గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించొద్దు.
పనిచేసే సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించడంతోపాటు చేతికి గ్లౌజులు తొడుక్కోవాలి.
కస్టమర్లు క్యూలలో నిల్చొనేటప్పుడు తప్పకుండా 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
రిసెప్షన్‌ వద్ద శానిటైజర్లు, వాష్‌ ఏరియాల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్‌లు ఏర్పాటు చేయాలి.
హోటల్‌కు వచ్చే అతిథుల వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్‌ ఏర్పాటు చేయాలి.

కార్యాలయాల్లో...
ఎక్కువ మంది సిబ్బంది ఉండే కార్యాలయాలు సిబ్బందిని ఒకేసారి కాకుండా విడతలుగా లేదా వర్క్‌ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలి.
ప్రతి ఉద్యోగికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించడంతోపాటు మాస్కు వేసుకునేలా చేడాలి.
లిఫ్ట్‌ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. కార్యాలయం ప్రవేశంలోనే శానిటైజర్లు ఏర్పాటు చేసి వాటితో శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి.
శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నవారిని, జలుబు, దగ్గు తదితర లక్షణాలున్నవారికి ప్రవేశం అనుమతించవద్దు.
మీటింగ్‌లను వీలైనంత తగ్గించుకొని ఆన్‌లైన్‌ పద్ధతిలో ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
వాలెట్‌ పార్కింగ్‌ సిబ్బంది పూర్తి జాగ్రత్తతో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలి.

రెస్టారెంట్లలో...
కస్టమర్ల్ల సీటింగ్‌ స్పేస్‌ విశాలంగా ఉండేలా, వ్యక్తుల మధ్య ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించేలా ఏర్పాట్లు చేయాలి.
50% సీటింగ్‌ సామర్థ్యానికి మించి వినియోగదారులను అనుమతించకూడదు.
వృద్ధులు, చిన్నపిల్లల్ని అనుమతించవద్దు.
డిస్పోజబుల్‌ మెనూలను వాడాలి. ఒకరు వాడిన మెనూను మరొకరు వాడకుండా చూడాలి.
 బట్ట న్యాప్‌కిన్‌లకు బదులు వినియోగదారులకు కాగితపు న్యాప్‌కిన్‌లు ఇవ్వాలి.
కాంటాక్ట్‌లెస్‌ అర్డర్లతోపాటు డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలి.
ప్రధానంగా పార్శిల్‌ కౌంటర్లను ఏర్పాటు చేయాలి. టేక్‌ అవేను ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి.
డోర్‌ డెలివరీ చేసే సిబ్బందికి తరచూ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయడంతోపాటు శానిటైజర్‌ వినియోగాన్ని విస్తృతంగా వాడేలా చూడాలి.
సెంట్రలైజ్డ్‌ ఏసీ వాడకాన్ని తగ్గించి బయటిగాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
కస్టమర్లు వచ్చి వెళ్లిన వెంటనే శానిటైజేషన్‌ చేయాలి.

షాపింగ్‌ మాల్స్‌లో...
లోనికి వచ్చే ఉద్యోగులు మొదలు కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి.
షాపింగ్‌మాల్‌ సామర్థ్యంలో సగం మందికే ప్రవేశం కల్పించాలి.
ప్రతి కస్టమర్‌ ఎడం పాటించేలా చూసేందుకు ప్రత్యేకంగా  సిబ్బందిని నియమించాలి.
ఉద్యోగులు, సిబ్బంది చేతికి గ్లౌజులు వేసుకున్నాకే కస్టమర్లకు వస్తువులు అందించాలి.
పిల్లల ఆట ప్రాంగణాలను తెరవకూడదు.
లిఫ్ట్‌ వినియోగాన్ని తగ్గించి ఎస్కలేటర్లను ప్రోత్సహించాలి. కస్టమర్ల తాకిడిని బట్టి వీలైనప్పుడల్లా షాపింగ్‌ మాల్‌ను సోడియం హైపోక్లోరైడ్‌ లాంటి ద్రావణంతో శానిటైజ్‌ చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement