డ్యూయెల్ రోల్‌లో ధనుష్
నటుడు ధనుష్ ద్విపాత్రాభినయానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు ధనుష్. వేలై ఇల్లా పట్టాదారి, మారి చిత్రాల సక్సెస్‌తో యమ స్పీడ్ మీదున్న ఈయన ప్రస్తుతం వీఐపీ2(వేలై ఇల్లా పట్టాదారికి సీక్వెల్) చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తదుపరి ప్రభు సాలమెన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
తదుపరి వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. తాజాగా మరో చిత్రానికి ధనుష్ పచ్చజండా ఊపారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకు ముందు ఎదుర్‌నీచ్చల్,ఆ మధ్య విడుదలైన కాక్కిసట్టై వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్ని తెరకెక్కించిన యువ దర్శకుడు దురై సెంథిల్ దర్శకత్వంలో ధనుష్ నటించడానికి ఓకే అన్నారట. విశేషమేమిటంటే ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారట. తన 13 ఏళ్ల సినీ కేరీర్‌లో ధనుష్ ఇప్పటి వరకూ డ్యూయల్ రోల్ పోషించలేదన్నది గమనార్హం. కాబట్టి ఇది ధనుష్ అభిమానులకు ఆనందకరమైన వార్తే అవుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం 2016 సంవత్సరంలో తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తునట్లు తెలిసింది.