డిజిటల్ గ్రామాలకు మైక్రోసాఫ్ట్ చేయూత | Digital villages Microsoft Support | Sakshi
Sakshi News home page

డిజిటల్ గ్రామాలకు మైక్రోసాఫ్ట్ చేయూత

Published Sat, Jul 4 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

డిజిటల్ గ్రామాలకు మైక్రోసాఫ్ట్ చేయూత

డిజిటల్ గ్రామాలకు మైక్రోసాఫ్ట్ చేయూత

- వెల్లడించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
- మైక్రోసాఫ్ట్ సీఈవోసత్య నాదే ళ్లతో భేటీ
- రాష్ట్రంలో స్మార్ట్ సిటీ, గ్రామాల్లో ఆరోగ్య సేవలకు చేయూత
- పుణేలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటు
ముంబై:
రాష్ట్రంలో డిజిటల్ గ్రామాలు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి మైక్రోసాఫ్ట్ సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. వారం రోజుల పర్యటనలో భాగంగా  అమెరికా వెళ్లిన సీఎం గురువారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆరోగ్య సౌకర్యాలు, డిజిటల్ గ్రామాలకు సాంకేతిక సహాయం చేయడానికి మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని భేటీ అనంతరం సీఎం ట్వీట్ చేశారు. అమరావతి జిల్లాలోని మెల్‌ఘాట్ గ్రామంలో పెలైట్ ప్రాజెక్టుగా దీన్ని మొదలు పెడతామని చెప్పారు.

మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) మదిరిగా స్మార్ట్‌సిటీ నిర్మాణానికి సహకరిస్తానని ఐటీ దిగ్గజం హామీ ఇచ్చిందని అన్నారు. అలాగే పుణేలో సైబర్ సెక్యూరిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పుకుందని చెప్పారు. అనంతరం బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ సీఈఓ రేమండ్ కార్నర్‌తో సీఎం సమావేశ మయ్యారు. నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో విమానాల నిర్వహణ, మరమ్మతుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని, శిక్షణ తరగతులు కూడా ప్రారంభిస్తామని బోయింగ్ హామీ ఇచ్చిందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) జాయ్ మినారిక్‌తో సమావేశమైన సీఎం రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీకి సహకరించాలని కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏడబ్ల్యూఎస్ సిద్ధంగా ఆసక్తి చూపుతోందని ఆయన పేర్కొన్నారు.
 
కీలక కంపెనీలతో భేటీ

వారంరోజుల పర్యటనలో భాగంగా అమెరికా వచ్చిన సీఎం న్యూయార్క్, న్యూజెర్సి, డెట్రాయిట్‌లలో పర్యటించారు. జనరల్ మోటార్స్, క్రిస్లర్ హెడ్‌క్వార్టర్స్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం శాన్‌ఫ్రాన్సిస్కో బయలు దేరిన సీఎం తర్వాత లాస్‌ఏంజిల్స్ వెళ్తారు. పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్, రాష్ట్ర కేబినెట్ మంత్రులతో అమెరికా బయలుదేరిన సీఎం గూగుల్, సిస్కో, ఆపిల్ సంస్థలతో భేటీ అయ్యారు. బ్లాక్‌స్టోన్, పంచ్‌సిల్‌లతో వివిధ జాయింట్ వెంచర్ల ప్రాజెక్టులకుగానూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈఓఎన్ ఫ్రీ ఓన్ సెజ్‌లో రూ. 750 కోట్లు, హింజెర్వాడీలో రూ. 1,200 కోట్లు, సెంట్రల్ ముంబైలోని ఐటీ పార్క్‌లో రూ. 1,500 కోట్లు, ముంబైలోని మరో ఐటీ పార్క్‌లో రూ. 1050 కోట్లు పెట్టుబడి పెట్టడానికి బ్లాక్‌స్టోన్ అంగీకరించిందని సీఎం ట్వీట్ చేశారు. చిప్‌లున్ ఎంఐడీసీలో రూ. 500 కోట్లు కోకకోలా కంపెనీ పెట్టుబడి పెట్టనుంది.
 
సీఎం కారణం కాదు: ప్రయాణికులు

ఎయిర్ ఇండియా విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కాదని ఆయనతోపాటు విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు అన్నారు. ఇమిగ్రేషన్ సమస్య వల్ల ప్రయాణం ఆలస్యమైందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కారణంగా జూన్ 30న అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గంట ఆలస్యంగా బయలు దేరిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సీఎంతో పాటు  అమెరికా పర్యటనకు బయలుదేరిన ఓ అధికారి సరైన డాక్యుమెంట్లు తీసుకురాకపోవడం వల్ల విమానం నిలిపివేయాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని  శుక్రవారం ట్వీట్ చేశారు. ఆయనతోపాటు ప్రయాణించిన మరో ఇద్దరు ప్రయాణికులు ఆయన మద్దతు పలికారు. విమాన ప్రయాణం ఆలస్యానికి కారణం సీఎం ఫడ్నవీస్ కాదని ట్వీట్ చేశారు. ఇమిగ్రేషన్ సమస్య వల్ల విమానం ఆలస్యంగా బయలు దేరిందని ఉదయ్‌పూర్‌కు చెందిన రచయిత, జర్నలిస్ట్ దుశ్యంత్ అనే ప్రయాణికుడు ట్వీట్ చేశారు.

విమానాన్ని ఆపమని సీఎం చెప్పలేదని, ఆ సమయంలో ఆయన ఏవో ఫైళ్లు చూస్తున్నారని మరో ప్రయాణికుడు అరవింద్ షా ట్వీట్ చేశారు. అయితే తప్పదోవ పట్టించడానికే ఆరోపణలు చేస్తున్నారని సీఎం అన్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ, ముఖ్య కార్యదర్శి ప్రవీణ పర్దేశీతో కలసి సీఎం ఫడ్నవీస్ జూన్ 30న అమెరికా బయలుదేరిన సమయంలో ఘటన జరిగింది. పర్దేశీ సరైన యూఎస్ వీసా తీసుకురాకపోవడంతో ఆయన వీసా తీసుకువచ్చాక విమాన బయలుదేరిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఘటనపై కాంగ్రెస్ సీఎం ఫడ్నవీస్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది. ప్రజలను సీఎం క్షమాపణ కోరాలని డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement