నేడు కోర్టుకు దినకరన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. సోమవారం ఆయన్ను ఢిల్లీలో కోర్టుకు హాజరు పరచనున్నారు. ఆయన్ను మళ్లీ తమ కస్టడీకి తీసుకునేందుకు తగ్గ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఆరోపణలతో ఢిల్లీ పోలీసుల ఉచ్చులో దినకరన్ చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ మూడు రోజుల పాటు చెన్నైలో సాగింది.
కోర్టు ఇచ్చిన పోలీసు కస్టడీ కాలం ఆదివారంతో ముగియడంతో సోమవారం ఆయన్ను కోర్టులో హాజరు పరిచేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. కేసు విచారణ మరింత ముందుకు సాగాల్సి ఉండడం, ఆధారాల అన్వేషణ కోసం మరింతగా శ్రమించాల్సి ఉండడంతో మరికొద్ది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును ఆశ్రయించే కసరత్తుల్లో ఉన్నారు. ఈ సారి కోర్టు కస్టడీకి అప్పగించేనా లేదా, రిమాండ్‌కు తరలించేనా అన్నది వేచిచూడాల్సిందే.
సోమవారం కోర్టులో హాజరు పరిచినానంతరం ఢిల్లీ పోలీసులు మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు తమకు లభించిన ఆధారాలు, వివరాల మేరకు తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు అధికారుల్ని విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలిపిస్తూ సమన్లు జారీ చేయొచ్చన్న సంకేతాలతో ఉత్కంఠ బయలు దేరింది.
ఇప్పటికే ఐదుగురికి సమన్లు జారీ చేసి ఉండడం, వారు సోమవారం లేదా మంగళవారం విచారణకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వీరి వద్ద జరిపిన విచారణ మేరకు మంత్రులు, అధికారుల భరతం పట్టే విధంగా దూకుడు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఓ బ్రోకర్ వద్ద పోలీసులు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.