ప్రజల్లోకి కరుణ
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ప్రజల్లోకి రానున్న సమాచారం ఆ పార్టీ వర్గాల్లో ఆనందాన్ని నింపింది. అయితే ఇందు కోసం నెల రోజులు వేచి చూడాల్సిందే. తన జన్మదినం జూన్ 3న ఆయన అన్నా అరివాలయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
వయోభారం, అనారోగ్య సమస్యలతో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కొన్ని నెలలుగా గోపాలపురం ఇంటికే పరిమితమయ్యారు. ఆయన ప్రతినిధిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్ డీఎంకేను నడిపిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి వివరాలు బయటకు రాకున్నా, అప్పుడప్పుడు ఆయన ఫొటోలు ఆ పార్టీ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. స్టాలిన్ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం కరుణానిధి ఆశీస్సులు అందుకుంటున్న ఫొటో వెలువడింది.
తదుపరి ఈ నెల మొదటి వారంలో డీఎంకే ఎంపీ, గారాల పట్టి కనిమొళి కరుణ ఆశీస్సులు అందుకుంటున్నట్టుగా వెలువడ్డ ఫొటో డీఎంకే వర్గాల్లో ఆనందం నింపింది. కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని, ఇన్ఫెక్షన్ కారణంగా గోపాలపురం ఇంటికి పరిమితమయ్యారని డీఎంకే వర్గాలు పేర్కొంటూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజల్లోకి కరుణానిధి రాబోతున్నారన్న సమాచారం డీఎంకే వర్గాల్లో మరింత ఆనందం నింపింది. జూన్ 3న కరుణానిధి 94వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఏటా జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఆయన కలుసుకుంటారు. ఆ బాటలోనే ఈ ఏడాది కూడా పార్టీ శ్రేణులను కలుసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఈ విషయంగా డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్.ఇళంగోవన్ పేర్కొంటూ, కరుణానిధి ఆరోగ్యం మెరుగు పడుతూ వస్తుందన్నారు. కార్యకర్తల్ని కలవాలన్న ఆశతో ఉన్నారని, అయితే, వైద్యుల సూచనలు, సలహాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
స్టాలిన్‌కు ఆహ్వానం :
జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరుకావాలని స్టాలిన్‌కు ఆహ్వానం వచ్చింది. శ్రీలంకలో జరిగిన మారణకాండలో తమిళులు హతమార్చబడిన విషయం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ డీఎంకే నేతృత్వంలో జరిగిన మహానాడులో కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ఉల్లంఘన సదస్సు ముందుకు ఆ తీర్మానాలు చేరాయి. ఈ దృష్ట్యా జెనీవా వేదికగా జూన్ 12న జరగనున్న సదస్సుకు డీఎంకే తరఫున హాజరుకావాలని ఐక్యరాజ్యసమితి నుంచి స్టాలిన్‌కు ఆహ్వానం అందింది.