తమిళ సినిమా: కరుణానిధి.. కేవలం రాజకీయాల్లోనే కాదు తనదైన సృజనాత్మక కథా కథనాలతో తమిళ చలనచిత్ర రంగంలో విప్లవం తీసుకొచ్చిన ఘనత ఆయనది. కరుణానిధి ఒక్క తమిళులకే కాదు.. మన తెలుగు వారికీ గర్వకారణమే. ఎందుకంటే ఆయన తెలు గు జాతికి చెందిన వారు కావడమే. ఈయన అసలు పేరు దక్షిణామూర్తి. చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై మక్కవ కలిగిన కరుణానిధి 14 ఏళ్ల వయసులోనే పాటలు పాడుతూ ద్రవిడవాదాన్ని ప్రచారం చేశారు. ఒక పక్క విద్యార్థి నాయకుడిగా ఉద్యమాలు చేస్తూనే.. మరో పక్క తన సినీ అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేశారు.
పరాశక్తితో విప్లవం
రాజకుమారి సినిమా(1947)తో సినీజీవితాన్ని ప్రారంభించిన ఆయన..తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. ఇక 1952లో ఆయన కథ, సంభాషణలను అందించిన పరాశక్తి చిత్రం తమిళ చిత్ర సీమలో పెను విప్లవం. ఈ చిత్రంలోని ఒక్కో పదం చురకత్తిలా స్వార్థ రాజకీయ వ్యవస్థను చీల్చి చెండాడింది. అంతేకాదు బ్రాహ్మణ కుల జాడ్యాన్ని ప్రస్తావించడంతో అనేక వివాదాల్లో చిక్కుకోవటంతో పాటు నిషేధాన్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు 1952లో విడుదలైన పరాశక్తి ద్రవిడ ఉద్యమానికి మరింత ఊపునివ్వటమే కాకుండా అఖండ విజయం సాధించింది. నడిగర్ తిలగం శివాజీగణేశన్, ఎస్‌ఎస్. రాజేంద్రన్ వంటి ఎందరో నటులు ఈ చిత్రంతోనే పరిచయం అయ్యారు.
అనంతరం కలంపణం, తంగరధం వంటి చిత్రాల్లో వితంతు వివాహాలు, అంటరానితనం తదితర అంశాల్లో కరుణ తనదైన శైలిలో సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. సినీరంగంలో ఆయనను, ఎంజీఆర్, జయలలితలను మోడరన్ ధియేటర్ అధినేత టీఆర్ సుందరం ఎంతగానో ప్రోత్సహించారు. ఎంజీఆర్, శివాజీగణేశన్, జయలలిత లాంటి ఎందరో ప్రముఖ నటీనటుల ఉన్నతికి కరుణానిధి కథ, కథనాలు, సంభాషణలు దోహదపడ్డాయి. ఇక, మక్కల్ తిలగం ఎంజీఆర్ రాజకీయ జీవితానికి కరుణ అందించిన సంభాషణలే కారణమన్నది జగమెరిగిన చరిత్ర. ఇటు సినీ, అటు రాజకీయ రంగంలో వారి మైత్రి ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది. అందుకే తమిళ చిత్ర సీమకు కరుణను గొప్ప నిధిగా విశ్లేషకులు పేర్కొంటారు.
సినీ సేవకు పట్టం
చిత్ర పరిశ్రమకు చేసిన విశేష కృషికి గానూ ఆయనకు పలు అవార్డులు, బిరుదులు వరించాయి. 1971లోనే అన్నామలై విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించింది. తెన్‌పాండి సింగం నవలకు గానూ తంజావూర్ తమిళ విశ్వవిద్యాలయం రాజరాజన్ అవార్డుతో సత్కరించింది. ఆయన సీఎం అయ్యాక సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 2006లో సినిమాలకు తమిళ పేర్లు పెడితే పన్ను మినహాయింపు ఇచ్చి పరిశ్రమను ప్రొత్సహించారు.
వెండితెర అజరామరాలు
తొలిసారిగా జూపిటర్ పిక్చర్స్‌లో స్క్రీన్‌ప్లే రైటర్ గా చేరిన ఆయన రాజకుమారి చిత్రానికి కథనాన్ని అందించారు. ఈ చిత్రం విజయంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈయన కథలతో నిర్మించిన చిత్రాలు తెలుగు తదితర భాషల్లో అనువాదమై విజయం సాధించాయి. ఆయన చివరగా 2011లో పొన్నార్‌శంకర్ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు.
Comments
Please login to add a commentAdd a comment