65 సీట్లు ఇవ్వాల్సిందే!
65 సీట్లు ఇవ్వాల్సిందే!
Published Fri, Mar 25 2016 8:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, చెన్నై: డీఎంకేతో పొత్తు పదిలం కావడంతో సీట్ల పంపకానికి కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. అయితే, జీకే వాసన్ బయటకు వెళ్లడం, తమిళ మానిల కాంగ్రెస్‌ను పునరుద్ధరించడంతో కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడ్డ దృష్ట్యా, వారు కోరినన్ని సీట్లు ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా లేదన్న సంకేతాలు ఉన్నాయి. డీఎండీకే తమతో కలసివస్తే వారికి యాభై, కాంగ్రెస్‌కు ముప్పై వరకు ఇచ్చి, తాము 140 స్థానాల్లో పోటీచేసి, మిగిలిన చిన్న పార్టీలకు 14 సీట్లను సర్దుబాటు చేసే విధంగా తొలుత డీఎంకే వ్యూహ రచన చేసి ఉన్నట్టు సమాచారం.
అయితే, డీఎండీకే కలసి రాని దృష్ట్యా, 190 స్థానాల్లో పోటీచేయడానికి తగ్గ వ్యూహ రచనలు, కసరత్తుల్ని డీఎంకే చేసి ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. డీఎండీకే లేదు కాబట్టి తమకు సీట్ల సంఖ్య పెంచాలన్న నినాదాన్ని కాంగ్రెస్ తెర మీదకు తెచ్చింది. డీఎంకే మీద ఒత్తిడి తెచ్చి 65 సీట్లను రాబట్టుకునే వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తమ వ్యూహాలకు పదును పెట్టి , డిఎంకే మీద ఒత్తిడి తెచ్చి ఆ సీట్లను రాబట్టుకునేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగనున్నారు.
శుక్రవారం ఉదయం ఆయన చైన్నైకు రానున్నారని, గోపాలపురంలో కరుణానిధిని కలిసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర పార్టీ సూచనతో ఢిల్లీలో సిద్ధం చేసిన తమకు బలం ఉన్న స్థానాల చిట్టాను కరుణానిధికి అందించి, తదుపరి సీట్ల పంపకాన్ని సామరస్య పూర్వకంగా ముగించుకునే వ్యూహంతో ఆజాద్ ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నా యి. కాంగ్రెస్ ఒత్తిడికి డీఎంకే తగ్గేనా అన్నది వేచి చూడాల్సిందే. ఏళ్ల తరబడి డిఎంకే వెంటే ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ పదిహేను సీట్లు ఆశించగా, చివరకు ఐదుతో సర్దుకోవాల్సి వచ్చింది.
ఇక, మనిదనేయమక్కల్ కట్చికి కేవలం మూడు సీట్లను రిజర్వు చేయడానికి కరుణానిధి నిర్ణయించినట్టు సమాచారాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు 65 ఇవ్వడం అనుమానమే. కాంగ్రెస్ పట్టుబట్టిన పక్షంలో గతంలో నిర్ణయించినట్టుగా ముప్పై సీట్లకు అదనంగా రెండు మూడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయే గానీ, తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్ వ్యూహాలు కరుణ ముందు పనిచేయవంటూ డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ సీట్ల పందేరం వివాదంతో తమను కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టే యత్నం చేస్తే, వారికి టాటా చెప్పి, పొత్తు వ్యవహారాల్లో తర్జన బర్జన పడుతున్న వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ను ఆహ్వానించేందుకు సైతం వెనుకాడబోరని వ్యాఖ్యానిస్తుండడం ఆలోచించ దగ్గ విషయమే.
Advertisement
Advertisement