ఎమ్మెల్యేలకు డబ్బులు.. కోర్టుకు విపక్షం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే మంళగవారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ముడుపుల బాగోతంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణ జరిపించాలని డిఎంకే డిమాండ్ చేసింది.
ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు శశికళ, పన్నీర్ సెల్వం భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెప్పినట్టు టైమ్స్ నౌ, మూన్ టీవీ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో డీఎంకే కోర్టుకు వెళ్లింది. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం 5 గంటలకు స్టాలిన్ ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు.
కాగా, తనపై చేసిన ఆరోపణలు చేసిన దక్షిణ మధురై ఎమ్మెల్యే ఎస్‌ఎస్ శరవణన్‌ను పన్నీర్ సెల్వం వివరణ కోరారు. విశ్వాస పరీక్ష నెగ్గేందుకు పన్నీర్ సెల్వం తనకు డబ్బులు ముట్టచెప్పారని శరవణన్ ఆరోపించారు.