శాసన సభ ఉప సంఘాల ఏర్పాటులో జాప్యంపై ప్రభుత్వ తీరును ఎండగట్టే పనిలో డీఎంకే, కాంగ్రెస్ శాసనసభా పక్షాలు నిమగ్నం అయ్యాయి. ఉప సంఘాల్ని ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం,
గవర్నర్ కూడా స్పందించిన దృష్ట్యా, కోర్టుకు వెళ్లనున్నట్టు డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో అసెంబ్లీలో అన్నాడీఎంకే–135(అమ్మ జయలలిత మరణంతో ఒకటి ఖాళీ), డీఎంకే– 89, కాంగ్రెస్– ఎని మిది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒకరు సభ్యులుగా ఉన్న విషయం తెలిసిం దే. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. అయితే ఇంత వరకు శాసన సభ ఉప సంఘాల ఏర్పాటు మీద దృ ష్టి పెట్టలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవహారాల పరిశీలన, సూచనలు, సలహాలను ఇచ్చేందుకు తగ్గట్టుగా 12 ఉప సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు తగ్గ ప్రయత్నాలు అడుగైనా ముందుకు సాగడం లేదు. ఇందుకు కారణం రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షానికి ఎదురుగా కూర్చుని ఉండడమే. ఈ సంఘాల్లో వారి ప్రాధాన్యం తప్పనిసరిగా పెరగడం ఖాయం. ఈ దృష్ట్యా, ఉప సంఘాల ఏర్పాటు మీద దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ శాసనసభా పక్షం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, డీఎంకే సభ్యులు వేర్వేరుగా స్పీకర్ ధనపాల్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి విన్నవించుకున్నా ఫలితం శూన్యం. చివరి ప్రయత్నంగా రాష్ట్ర గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్‌రావును ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే అబూ బక్కర్ కలిసి విన్నవించుకున్నా, స్పందన శూన్యం. దీంతో కోర్టులో తేల్చుకునేందుకు ప్రతి పక్షాలు సిద్ధం అయ్యాయి.
కోర్టులో తేల్చుకుంటాం
సోమవారం పన్నెండు గంటల సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్‌కు వచ్చారు. డీఎంకే ఎమ్మెల్యేలు దురై మురుగన్, ఏవీ వేలు, షణ్ముగం, శేఖర్ బాబు, సెల్వంలతో సమావేశం అయ్యారు. కాసేపటికి ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ వద్దకు వెళ్లారు. అక్కడ చర్చ తదుపరి వివరాలను స్టాలిన్ దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ ఆవరణ నుంచి వెలుపలకు వస్తూ స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు కార్యదర్శిగా ఆదిశేషన్‌ను నియమించారని గుర్తు చేశారు. అకారణంగా ఆయన్ను తొలగించడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చి నెల రోజులు అవుతున్నా, ఇంత వరకు కార్యదర్శిగా ఆదిశేషన్‌ను మళ్లీ నియమించ లేదని పేర్కొన్నారు. ఈ విషయంగా అసెంబ్లీ కార్యదర్శితో చర్చించామని, త్వరితగతిన నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. శాసనసభ ఉప సంఘాల ఏర్పాటులో జాప్యం సాగుతున్నదని, గవర్నర్‌కు విన్నవించుకున్నా ఫలితం శూన్యమే కాబట్టి, ఇక కోర్టులో తేల్చుకుంటామన్నారు. డీఎంకే నేతృత్వంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. సీఎం పన్నీరుసెల్వంకు ఆ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ పార్టీ వ్యవహారాల్లోకి తాను వెళ్లదలచుకోలేదని, కేవలం ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. జయలలిత గొప్ప నాయకురాలని, ఆమె మరణంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కల్గిందన్నదని తన వ్యక్తిగత వ్యాఖ్యగా ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పోయెస్ గార్డెన్‌కు భద్రత ఎందుకు అని తాను ప్రశ్నించ లేదని, పోయెస్ గార్డెన్ వద్ద సీఎంకు కల్పించినంతగా శశికళకు ఎందుకు అంత భద్రత అని తాను ప్రశ్నించానంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అవిశ్వాసానికి సిద్ధమా?: చెన్నై విమానాశ్రయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి మీడియాతో మాట్లాడుతూ శాసన సభ ఉప సంఘాల ఏర్పాటుపై దృష్టి పెట్టక పోవడం శోచనీయమని విమర్శించారు. పన్నీరుసెల్వంకు వ్యతిరేకంగా కొందరు మంత్రుల చర్యలు ఉన్నాయని గుర్తు చేశారు. సీఎంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే ధైర్యం ఉందా అని ఆ మంత్రుల్ని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షాలు ముందుకు సాగుతున్నాయని, అలాంటప్పుడు శాసనసభ ఉప సంఘాల్లో ప్రతిపక్షాలకు ప్రాధాన్యం దక్కుతుందేమోనన్న భయంతో వెనకడుగు వేయడం శోచనీయమని మండిపడ్డారు.
ఉపసంఘం కోసం పట్టు
Published Tue, Dec 27 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
Advertisement
Advertisement