ఆలందూరులో డీఎంకే అభ్యర్థి భారతి
Published Tue, Mar 11 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
సాక్షి, చెన్నై: ఆలందూరు ఉప ఎన్నిక బరిలో డీఎంకే అభ్యర్థిగా ఆర్‌ఎస్ భారతి పోటీ చేయనున్నారు. డీఎండీకే అభ్యర్థిగా కామరాజన్ పోటీకి సిద్ధమవుతున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై మహానగరం పరిధిలోని కాంచీపురం జిల్లా ఆలందూరు నియోజకవర్గం నుంచి డీఎండీకే అభ్యర్థి బన్రూటి రామచంద్రన్ గెలిచారు. ఆయన డీఎండీకే నుంచి బయటకు వస్తూ, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సైతం చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో చేరిన బన్రూటి ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసే పనిలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా స్థానిక నాయకుడు వీఎన్‌పీ వెంకట్రామన్ ఎన్నికల్లో పోటీ చేస్తారని గత వారం జయలలిత ప్రకటించారు. కరుణి నిర్ణయం: అన్నాడీఎంకే అభ్యర్థి బరిలో దిగడంతో డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను దించేనా అన్న ఉత్కంఠ నెలకొం ది. ఇది వరకు కూటమి ధర్మానికి కట్టుబడి ఈ స్థానానికి కాంగ్రెస్‌కు అప్పగిస్తూ వచ్చిన డీఎంకే, ఈ సారి అభ్యర్ధిని దించింది.
ఆ పార్టీ న్యాయవాద విభాగం నేత ఆర్‌ఎస్ భారతీని అభ్యర్థిగా ఎంపిక చేస్తూ డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. గత లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై అభ్యర్థిగా ఆర్‌ఎస్ భారతీ పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆలందూరు నియోజకవర్గ పరిధిలో ఆయనకు ఇతర పార్టీల అభ్యర్థుల కన్నా అత్యధిక ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన్ను విజయం వరించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే అభ్యర్థి కామరాజన్: అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల ప్రకటనతో సిట్టింగ్ బరిలో ఎవరిని డీఎండీకే దించుతుందోనన్న ప్రశ్న బయలు దేరింది. ముందుగా ఊహించినట్టే ఆలందూరుపార్టీ నేత కామరాజన్‌ను రంగంలో కి దించేందుకు విజయకాంత్ నిర్ణయించారు. బీజేపీతో పొత్తు ప్రకటన రోజే అభ్యర్థిని పరిచ యం చేయడానికి విజయకాంత్ నిర్ణయించి నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లోను స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన గాయత్రీ దేవి మళ్లీ రేసులో దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Advertisement