
చెన్నై,తిరువొత్తియూరు : వ్యవసాయ పొలంలో వెళ్తున్న సమయంలో యజమానిని రక్షించడానికి మూడు శునకాలు పాముపై దాడి చేసి కొరికి చంపేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కోవై సమీపం ఒత్తకాల్ మండపం పూంగా నగర్‌కు చెందిన రామలింగం రైతు. అతని ఇంటికి సమీపంలోనే వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంలో కట్టేసిన పశువులకు గడ్డి వేయడానికి తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో తాను పెంచుతున్న మూడు కుక్కలు అతని వెంట వెళ్లాయి. వారు వెళుతున్న మార్గంలో సుమారు 6 అడుగుల పాము దాడికి యత్నించింది. దాని నుంచి రామలింగం, అతని స్నేహితుడు తృటిలో తప్పించుకున్నారు. వెంటనే మూడు శునకాలు పాముపై దాడి చేసి పామును చుట్టిముట్టి కొరికి చంపేశాయి. ఈ దృశ్యాన్ని రామలింగంతో వచ్చిన స్నేహితుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. తన ప్రాణాలకు తెగించి శునకాలు చేసిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.