ఇక ఆన్లైన్ లో పంటల అమ్మకం
Published Mon, Sep 19 2016 12:57 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
భైంసాలో ఈ-నామ్ కొనుగోళ్లు
నేటి నుంచి ప్రారంభం
దిగుబడులకు అధిక ధర
భైంసా : జాతీయ వ్యవసాయ మార్కెట్(నామ్) విధానంతో దేశంలో ఎక్కడైనా ఒక చోట మార్కెట్‌లో పంటలు అమ్మకానికి తీసుకువచ్చి ధర అధికంగా ఉన్నచోట అమ్ముకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతీయ వ్యవసాయ మార్కెట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నామ్ కింద మన జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా మార్కెట్ కమిటీలు ఎంపిక చేశారు. రైతులు వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి పంట తీసుకురాగానే ప్రవేశ ద్వారం వద్ద ఈ-నామ్‌లో గేటువద్ద ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయించాలి. దీంతో ఆ వివరాలు నామ్ కింద ఉన్న అన్ని దేశీయ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వెళ్తుంది. ఆ పంటకు సంబంధించి ఏఏ మార్కెట్‌లో ఎంతెంత ధర ఉందో తెలుస్తుంది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 585 మార్కెట్‌లను నామ్ కింద ఎంపిక చేయనుంది. అందులో భాగంగానే 2015-16 సంవత్సరానికి 250 మార్కెట్లలో 2016-17లో 200 మార్కెట్లలో, 2017-18లో 135 మార్కెట్లలో నామ్ ప్రవేశపెట్టడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరర్ కోపరేటివ్ స్మాల్‌ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎన్‌ఎఫ్‌ఏసీ) ద్వారా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు చేస్తుంది. ఒక్కోమార్కెట్‌కు సాఫ్ట్‌వేర్‌కు అవసరమయ్యే కంప్యూటర్‌లు, ప్రింటర్ ఇతర సామగ్రిని అందజేస్తుంది. రెండో దశలో మన జిల్లాలోనే రెండు మార్కెట్ కమిటీలను ఎంపిక చేశారు.
ఏర్పాట్లు పూర్తి..
ఇప్పటికే భైంసా మార్కెట్ కమిటీకి కేంద్ర నామ్ అధికారులు వచ్చారు. ఆన్‌లైన్ ఈ-నామ్ ఎంట్రీగదితోపాటు ఇతరాత్రా రికార్డులు అందించారు. ఈ-నామ్ కింద ఎలా నమోదు చేయాలో అనే విషయాలపై సిబ్బందికి శిక్షణ కూడా అందించారు. కేంద్ర అధికారిక యంత్రాంగం ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది.
నేటి నుంచి ప్రారంభం
భైంసా పట్టణంలో సోమవారం నుంచి ఈ-నామ్ కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. గాంధీగంజ్ ప్రవేశద్వారం పక్కనే ఎంట్రిగదిని నిర్మించారు. ఈ గదిలో కంప్యూటర్‌లను అందుబాటులో ఉంచారు. రైతులు రాగానే గ్రామం పేరు, బ్యాంకు ఖాతా, సెల్ నంబరు, పంట వివరాలను నమోదు చేస్తారు. నామ్ కింద ఉన్న అన్ని జాతీయ మార్కెట్‌లలో ఈ వివరాలు నమోదవుతాయి. అక్కడక్కడ సంబంధిత పంటకు ఉన్న ధరలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రైతు ఇష్టం మేరకు పంటను సంబంధిత మార్కెట్లకు విక్రయిస్తారు. రైతు సమ్మతి లేకుంటే తిరిగి మళ్లీ రెండో సారి ఈ-నామ్‌లో వివరాలు నమోదు చేస్తారు.
ఒక చోట ఫీజు చెల్లిస్తే చాలు
జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం వల్ల దేశంలో ఎక్కడైనా ఒక చోట మార్కెట్ ఫీజు చెల్లిస్తే అన్ని చోట్ల వర్తిస్తుంది. రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. గతంలో మధ్య వర్తులు కొనుగోలు చేసి దళారులకు, బడా వ్యాపారులకు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఆ పంటను నేరుగా మధ్యవర్తుల ప్రమేయంలేకుండా వ్యాపారులే కొనుగోలుచేసే అవకాశం ఉండడంతో గిట్టుబాటు ధరలు రైతులకు దక్కే అవకాశం ఉంది. ఈ విధానం ప్రారంభంతో రైతులకు ఎలా మేలుచేకూరుతుందో ఆన్‌లైన్ పంట అమ్మకాలు ఎలా జరుగుతాయో అనే దాని కోసం భైంసా రైతాంగం ఎదురుచూస్తోంది.
ఎక్కడి వ్యాపారులైనా...
ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న వ్యాపారులే రైతుల సరుకులను పరిశీలించి బీట్ నిర్వహిస్తారు. బీట్‌లో వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వచ్చేది. స్థానికంగా ఉన్న ఖరీదుదారులకు ఉన్న గోదాం, ఆర్థిక స్థితికి అనుకూలంగానే పంటలను కొనేవారు. కానీ నామ్ కింద జాతీయ వ్యవసాయ మార్కెట్లలోని బడా వ్యాపారులు సైతం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విధానంతో బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌తోపాటు పలు మార్కెట్‌లలోనూ ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేపట్టవచ్చు. దేశంలోని అన్ని మార్కెట్‌యార్డుల్లో ఈ సరికొత్త విధానంలో పంటలు అమ్మిన రైతులకు డబ్బులు ఇచ్చేందుకు ఎస్‌క్రో అకౌంట్ పేరుతో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రైతులు మార్కెట్‌లో సరుకులు అమ్మితే అడితిదారులు, కమీషన్ ఎజెంట్‌లు డబ్బులు చెల్లించేవారు. నూతన విధానంతో కొనుగోలుదారులు రైతులకు పంట సరుకు విలువను మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించే ఎస్‌క్రో అకౌంట్‌లో డబ్బులు వేస్తారు. ఖరీదుదారు సంబంధిత డబ్బులను ఈ అకౌంట్‌లో వేయగానే రైతు తీసుకువచ్చిన సరుకును విలువకట్టి సంబంధిత రైతు ఖాతాలో జమ చేస్తారు. తద్వారా రైతులకు దళారుల బెడద తగ్గనుంది. ఎక్కడెక్కడ ఎంత ధర ఉందో కూడా తెలుసుకునే అవకాశం రైతులకు ఉంటుంది.
Advertisement