ఆరు జిల్లాలకు వర్తింపు
= మూడు జిల్లాల్లో నమోదు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో నగదు బదిలీ అమల్లోకి వచ్చింది. దక్షిణాదిలోని ఆరు జిల్లాల్లో బుధవారం నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చారు. మరో మూడు జిల్లాల్లో గ్యాస్‌కు ఆధార్ నెంబర్ తప్పనిసరి చేశారు. ఆధార్ నెంబర్లను నమోదు చేసుకోవాలన్న ఆదేశాలు జారీ చేశారు.
గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారులకు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే, దీనికి ఆధార్ కార్డును లింక్ పెట్టడం వివాదానికి దారి తీసింది. సుప్రీం కోర్టు సైతం అక్షింతలు వేయడంతో కేంద్రం కాస్త వెనక్కు త గ్గింది. పూర్తి స్థాయిలో ఆధార్ కార్డుల జారీ అనంతరం, ఆ నెంబరు ఆధారంగా గ్యాస్ సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో పడే విధంగా చర్యలు చేపట్టారు. అయితే, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో తన నిర్ణయాన్ని అమలు చేయించడం లక్ష్యంగా ముందుకెళుతోంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఫొటోలు, వేలి ముద్రల సేకరణ చేసినప్పటికీ, కార్డుల జారీలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డులు నామమాత్రంగానే అందారుు.
అమలు: ఇటీవల మదురై, శివగంగై జిల్లాల్లో లాంఛనంగా నగదు బదిలీ పథకాన్ని ఆరంభించారు. తాజాగా ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో పథకం అమల్లోకి వచ్చింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తేని, దిండుగల్, రామనాధపురం, కన్యాకుమారి జిల్లాల్లో కొత్త సంవత్సరం కానుకగా బుధవారం నుంచి నగదు బదిలీ అమల్లోకి తెచ్చారు. ఈ జిల్లాల్లో వంద శాతం ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి అయిందంటూ కేంద్రం పేర్కొంటుంటే, తమకు కార్డులు వస్తే ఒట్టు అని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ సబ్సిడీని ఆధార్ నెంబర్లు, బ్యాంక్ ఖాతా నెంబర్లకు ముడి పెట్టడాన్ని ఆ జిల్లాల్లోని వినియోగదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సబ్సిడీ బ్యాంకు ఖాతాలో పడేనా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారుు. నగరాల్లో, పట్టణాల్లో ఉండే వాళ్లరుుతే, సబ్సిడీ బ్యాంకుల్లో పడుతున్నాయా లేదా అని పరిశీలించగలరని, అయితే, తమలాంటి వారి పరిస్థితి ఏమిటంటూ దక్షిణాదిలోని మారుమూల గ్రామీణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి మదురై, శివగంగై కాకుండా మరో ఆరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో నగదు బదిలీ ఆరంభమైందో లేదో, విల్లుపురం, వేలూరు, కాంచీపురం జిల్లాల్లో ఆధార్ నెంబర్లను తప్పని సరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
మూడు నెలల్లోపు ఆధార్ నెంబర్లను తప్పని సరిగా గ్యాస్ నెంబర్లకు జత పరచాలని, బ్యాంకు ఖాతా నెంబర్లను అందజేయాలని ప్రకటించారు. అయితే, ఈ జిల్లాల్లో ఇంత వరకు ఆధార్ కార్డుల శిబిరాలు సక్రమంగా కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతలోపు కార్డుల నెంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనన్న హుకుం జారీ కావడంతో, ఈ నగదు బదిలీకి అడ్డుకట్ట వేసే రీతిలో రాష్ర్ట ముఖ్యమంత్రి జే జయలలిత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువే.
అమల్లోకి ‘నగదు బదిలీ’!
Published Thu, Jan 2 2014 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement