ఎనిమిది మంది ప్రాణాలు తీసిన ‘కొత్త’ వేడుకలు
ఎనిమిది మంది మృతి
చెన్నైలో 110 మందికి గాయాలు
కొత్త సంవత్సరంలో అడుగిడుతున్నామన్న ఆనందం అనేక కుటుంబాల్లో అంతలోనే ఆవిరైపోయింది. వేడుకల ఉత్సాహం శ్రుతిమించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై: శ్రీపెరంబుదూరులోని ఒక ప్రయివేటు నర్సింగ్ స్కూల్‌కు చెందిన టీ కలైయరసి (23), ఎస్.సరస్వతి (23), సుబ్బు (23), సవిత (23), మాలతి (21), ఎం.సరస్వతి (23) కలిసి కొత్త సంవత్సరం సందర్భంగా సమీపంలోని ఆలయాలకు నడిచి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక వాహనం వారిని ఢీకొనడంతో రోడ్డుపై చల్లాచెదరుగా పడిపోయారు.
అందర్నీ ఆస్పత్రికి తరలిస్తుండగా కలైయర సి, ఎస్.సరస్వతి, సుబ్బు మృతి చెందారు. తీవ్రగాయాలకు గురైన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నై మెరీనాబీచ్, సాంతోమ్, ఎలియడ్స్‌ల వద్ద సుమారు 50 ప్రమాదాలు చోటుచేసుకోగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రూపేన్ చక్రవరి (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌లో వెళుతూ జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మాధవరం మూలకడ వద్ద హ్యాపీ న్యూఇయర్ అంటూ కేకలు వేస్తూ బైక్‌లో వెళుతుండగా జారిపోవడంతో రత్నకుమార్ (20) ప్రాణాలు వదిలాడు.
కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తన ఇంటి ముందు మద్యం సేవిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్న యువతను ఇంటి యజమాని వెంకట్రామకృష్ణన్ వారిని నిలదీశాడు. ఇందుకు ఆగ్రహించిన యువకులు మద్యం బాటిల్‌తో పొడవడంతో వెంకట్రామకృష్ణన్ (54) మృతి చెందాడు. పాత చాకలి పేటకు చెందిన రూపేన్ చక్రవరి (22) మెరినీ బీచ్‌రోడ్డుకు వెళుతుండగా ట్రిప్లికేన్ వద్ద బైకు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే పరంగిమలైకి చెందిన సౌందరరాజన్ (20) అనే ఇంజినీరింగ్ రెండో సంవత్సర విద్యార్థి నందంబాక్కం వద్ద ప్రమాదానికి గురైప్రాణాలు విడిచాడు.