సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల భారం పడనుంది. విద్యుత్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వినియోగదారులపై కనీసం 20 శాతం అదనంగా చార్జీల భారం పడనుంది. విద్యుత్ వినియోగదారులపై భారం పడకుండా గత కాంగ్రెస్, ఎన్సీపీ డీఎఫ్ కూటమి సబ్సిడీ ఇవ్వడం ప్రారంభించింది.
దీన్ని బీజేపీ ప్రభుత్వం నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంతో భారం పడక తప్పదని స్పష్టమవుతోంది. దీనికి తోడు 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం చార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని కోరుతూ మహారాష్ట్ర విద్యుత్ రెగ్యూలేటరీ కమిషన్‌కు మహావితరణ విద్యుత్ కంపెనీ ప్రతిపాదన పంపించింది. ఒకవేళ దానికి కూడా మంజూరు లభిస్తే ఇక డబుల్ షాక్ తప్పదు. ముఖ్యంగా దీని ప్రభావం గృహ వినియోగదారులకంటే రైతులపై ఎక్కువ శాతం చూపనుంది.
‘సెక్యూరిటీ’ బండ..!
సాక్షి, ముంబై: విద్యుత్ వినియోగదారులకు ‘సెక్యూరిటీ డిపాజిట్’ పెంచాలని బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో కొందరికి ఈ నెలలో జారీచేసిన విద్యుత్ బిల్లుతోపాటు పెంచిన రూ.450 సెక్యూరిటీ డిపాజిట్ బిల్లు కూడా పంపిణీ చేసింది. ఇప్పటికే విపరీతంగా పెరిగిన విద్యుత్ బిల్లులో పేదలతోపాటు మధ్య తర గతి ప్రజలు సైతం బేజారవుతున్నారు. దీనికి తోడు అదనంగా డిపాజిట్ బిల్లు పంపడంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించని వినియోగదారుల నుంచి విద్యుత్ కంపెనీలు సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంటాయి. ఇదే తరహాలో బెస్ట్ సంస్థ కూడా వసూలు చేస్తోంది.
గతంలో రెండు నెలలకు సుమారు రూ.250-350 వరకు సామాన్య వినియోగదారులకు బిల్లు వచ్చేది. అప్పుడు డిపాజిట్ కింద రూ.100 వసూలు చేశారు. కాని రెండు, మూడేళ్ల నుంచి విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు నెలకు రూ. 750-950 వరకు బిల్లులు వస్తున్నాయి. దీంతో పెరిగినవిద్యుత్ చార్జీలను దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును కూడా పెంచాలని బెస్ట్ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది.
విడతల వారీగా నగరంలోని విద్యుత్ వినియోగదారులందరి నుంచి ఈ డబ్బును వసూలు చేయనున్నట్లు బెస్ట్ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ డిపాజిట్ బిల్లును నెలలోపు చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో వచ్చే నెల బిల్లులో దీనికి వడ్డీ కలిపి వసూలు చేస్తారు. కాగా, ఇప్పటి వరకు డిపాజిట్ రూపంలో రూ.30 కోట్లు మేర వచ్చాయని ఓ అధికారి తెలిపారు. పీకల లోతువరకు నష్టాల్లో కూరుకుపోయిన బెస్ట్ సంస్థ ఇప్పటికే నాలుగు రెట్లు బిల్లు పెంచింది. దీనికితోడు డిపాజిట్ పేరుతో ఇలా అదనంగా డబ్బులు వసూలు చేయడంపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో కరెంట్ ‘షాక్’!
Published Fri, Dec 5 2014 10:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement