Fact Check: Eenadu False Writings On Power Charges Hike From Last 4 Years, Facts Inside - Sakshi
Sakshi News home page

‘షాక్‌’ ఇచ్చింది చంద్రబాబే!.. డ్రామోజీ చెప్పని వాస్తవాలివీ

Published Wed, Jun 14 2023 5:19 AM | Last Updated on Wed, Jun 14 2023 8:57 AM

Eenadu false writings on power charges hike - Sakshi

సాక్షి, అమరావతి  :  ‘రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెరగడానికి గత టీడీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకమే కారణం. 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా అదనంగా విడు­దలచేస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తోంది.

2014–19 మధ్య పెరిగిన విద్యుత్‌ కొనుగోలు, పంపిణీ వ్యయాలను అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి  (ఏపీఈఆర్సీ) సమర్పించలేదు. నిజానికి.. ఏపీఈఆర్సీ  అనుమతించిన మేరకే డిస్కంలు విద్యుత్‌ చార్జీలను వసూ­లు చేస్తున్నాయి. అంతకుమించి ఒక్కపైసా కూడా వసూలు చేయడంలేదు.

కానీ, ప్రజలు ఏమా­త్రం భరించలేని విధంగా ప్రభుత్వం రకరకాల పేర్లతో ఇష్టారాజ్యంగా విద్యుత్‌ చార్జీలు పెంచిందంటూ ‘స్విచ్చేస్తే షాకే’ శీర్షికతో ఈనాడు మరో తప్పుడు కథనాన్ని మంగళవారం అచ్చేసింది..’ అంటూ ఆ పత్రిక రాతలను విద్యుత్‌ పంపిణీ సంస్థలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీలు ఐ.పృద్వీతేజ్, జె.పద్మా­జనార్ధన్‌రెడ్డి, కె.సంతోష్ రావులు మంగళవారం  అంశాల వారీగా వెల్లడించిన వివరాలివీ... 

ఆరోపణ: సామాన్యులు మోయలేనంత భారీగా గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలనుపెంచింది. 
వాస్తవం: ఈ అభియోగం పూర్తిగా అసత్యం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న ఎంబీసీలకు వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి అప్పటివరకు అమలులో వున్న వార్షిక ట్రూఆప్‌ చార్జీల స్థానంలో త్రైమాసిక  సర్దుబాటు చార్జీల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి త్రైమాసిక సర్దుబాటు చార్జీల స్థానంలో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఈ సంవత్సరం జూన్‌ నుంచి నెలవారీ విద్యుత్‌ కొనుగోలు చార్జీల సవరింపును అమలుచేస్తున్నాయి. అందువల్ల జూన్‌లో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెల విద్యుత్‌ కొనుగోలు చార్జీలు వర్తిస్తాయి. నిబంధనల ప్రకారం కనిష్ట గ్రిడ్‌ డిమాండ్‌ ఉన్న సీజన్‌లో ధరలు తక్కువుంటే ఆ తగ్గింపు కూడా వినియోగదారులకు వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమలవుతోంది.  

ఆరోపణ: ఉపాధి కోసం చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే చిన్న వ్యాపారులకు కూడా విద్యుత్‌ చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇవ్వలేదు. 
వాస్తవం: చిరు వ్యాపారుల ప్రయో­జనాలను పరిరక్షించా­లని ప్రభు­త్వం ఎంతో అంకితభావంతో ఉంది. అందువల్లే చిరు వ్యాపారులకు 2019 నుంచి ఇప్ప­టివరకూ విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. చిరు వ్యాపారులకు మేలు చేయా­­­లనే లక్ష్యంతోనే పలు వర్గా­లకు సబ్సిడీ రూపంలో ఉచిత విద్యు­త్‌ అమలు­చేస్తోంది. సెలూన్‌ షాపులు నడుపుకునే వారికి నెలకు 150 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ అందిస్తోంది.

దారిద్య్రరేఖకు దిగువనున్న గోల్డ్‌ స్మిత్‌లు (బంగారు ఆభరణాలు తయారుచేసే వారికి) వంద యూనిట్లు, ఇస్త్రీ దుకాణాలు నడుపుకునే రజకులకు 150 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. మరికొన్ని వర్గాల చిరు వ్యాపారులకు కూడా కొంతమేర ఉచిత విద్యుత్‌ అందిస్తూ సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఆక్వా యూనిట్లు, పవర్‌లూమ్‌ యూనిట్లు నడుపుకునే వారికి కూడా రాయితీతో కూడిన విద్యుత్‌ సరఫరా సౌకర్యం కల్పించింది. అంతేకాక.. చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. 

ఆరోపణ: ప్రజల నుంచి ఏటా రూ.11,270కోట్లు అద­నంగా వసూలుచేస్తూ ప్రభుత్వం దండుకుంటోంది. 
వాస్తవం: ఇది పూర్తిగా అసత్యం. ఏటా వ్యవసాయ, గృహ, వాణిజ్య విద్యుత్‌ కనెక్షన్లు పెరుగుతాయి. విని­యోగదారులు పెరిగినట్లే వసూలు మొత్తం పెరు­గు­తుంది. దీనిని అదనపు వసూళ్ల కింద చూప­డం సమంజసం కాదు. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ఏపీఈఆర్సీ సిఫా­ర్సుల ప్రకారమే డిస్కంలు విద్యుత్‌ చార్జీలు వసూలుచేస్తు­న్నాయి. ఇందులో కూడా ప్రభు­త్వం కొంత భాగం సబ్సిడీగా భరిస్తోంది.

విద్యుత్‌ పంపిణీ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాటి ఆదా­య అవసరాల నివేది­కలు ముందు సంవత్సరం సెపె్టంబర్‌ నెల నాటికి ఉన్న పరిస్థితుల ఆధా­రంగా రూపొందిస్తాయి. అప్పుడు వంద శాతం ఖచ్చితత్వ­ంతో విద్యుత్‌ కొను­గోలు వ్యయం అంచనా వేయడం సాధ్యపడదు. ఆర్థిక సంవత్సరం జరుగుతున్నప్పు­డు విద్యుత్‌ కొనుగోలు ఖర్చులో వాస్తవంగా హెచ్చుతగ్గులుంటాయి.

అవి విద్యుత్‌ చట్టంలోను, సంబంధిత నిబంధనలలో నిర్దేశించిన విధంగా ఇంధన చార్జీలలోగానీ, విద్యుత్‌ కొనుగోలు వ్యయంలోగానీ ఉండే హెచ్చుతగ్గులు సర్దుబాటు చార్జీల ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు వసూలుచేసుకునే వెసులుబాటు ఉంటుంది. దాని ప్రకారమే రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఈ సర్దుబాటు చార్జీలు విధిస్తున్నాయి. 

ఆరోపణ: ట్రూ అప్, ఇంధన సర్దుబాటు, విద్యుత్‌    సు­ం­­కం అంటూ రకరకాల పేర్లతో విద్యుత్‌ బిల్లులు వ­సూ­­లుచేస్తూ ప్రభుత్వం ప్రజలకు షాక్‌ కొడుతోంది. 
వాస్తవం: విద్యుత్‌ తయారుచేయాలంటే బొగ్గు, ఆయిల్‌ లాంటి అనేక ముడిపదార్థాలు అవసరం. వీటి కొనుగోలు ధర, రవాణా వ్యయం పెరిగినప్పుడు ఆ మేరకు విద్యుత్‌ చార్జీలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఇలా చేయక తప్పదు. గత ప్రభుత్వం ఇలా చార్జీలు వసూలుచేస్తే ఒప్పుగా, ఇప్పుడు వసూలుచేస్తే తప్పుగా ఈనాడుకు కనిపిస్తోంది. ఈ సంవత్సరం  విద్యుత్‌ నియంత్రణ మండలి వారి టారిఫ్‌ ఉత్తర్వుల ప్రకా­రం  అన్ని వనరుల నుంచి సరాసరి విద్యుత్‌ కొనుగోలు వ్యయం యూనిట్‌ రూ.4.31 ఉండగా, 2023 ఏప్రిల్‌ నెలలో సంభవించిన  అధిక ఉష్ణోగ్రతలవల్ల గ్రిడ్‌ డిమాండ్‌ అంచనాల కన్నా అధికంగా  పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం దాదాపు 617 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో స్వల్పకాలిక కొనుగోళ్ల ప్రాతిపదికన రూ.475 కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఏపీఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి యూనిట్‌కు రూ.0.20 ట్రూ అప్‌ చార్జీని డిస్కంలు వసూలుచేస్తున్నాయి. గృహ విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌ సుంకం పెరగలేదు. ఇదివరకు నిర్దేశించిన ప్రకారమే యూనిట్‌కు కేవలం 6 పైసలు  వసూలుచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలకు సంబంధించి విద్యుత్‌ కొనుగోలు, సరఫరా వ్యయం ప్రతి యూనిట్‌కు దాదాపు రూ.1.0 పెరిగినప్పటికీ నిబంధనల మేరకు యూనిట్‌కు కేవలం రూ.0.40 సర్దుబాటుగా వసూలుచేస్తున్నాయి.

ఆర్థిక సంవత్సరం 2020–21కు గాను కోవిడ్‌వల్ల విద్యుత్‌ డిమాండ్‌ కనిష్టంగా ఉన్న కాలంలో మార్కెట్‌ ధరలు అత్యంత కనిష్టంగా వున్నప్పుడు విద్యుత్‌ కొనుగోలు చేయడంతో దాదాపు రూ.4,800 కోట్లు విద్యుత్‌  పంపిణీ సంస్థలు మిగల్చాయి. ఈ తగ్గింపు వాస్తవ ఖర్చులు ఆడిట్‌  అయ్యాక విద్యుత్‌ నియంత్రణ మండలి వారు జారీచేసిన ఆర్థిక సంవత్సరం 2022–23 టారిఫ్‌ ఉత్తర్వులలో పంపిణీ సంస్థల నికర వార్షిక ఆదాయ అవసరాల నుంచి తగ్గించారు.

ఆరోపణ: వ్యవసాయ మీటర్లకు అమర్చే స్మార్ట్‌ మీటర్ల భారాన్ని ట్రూఅప్‌ చార్జీల రూపంలో ప్రజలపైనే వేయనుంది. 
వాస్తవం: వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్ల బిగింపునకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టంగా ప్రకటించింది. అయినా ఈ ఖర్చును ఇతర వినియోగదారులపై మోపుతారని ‘ఈనాడు’ పదే పదే అబద్ధాలు అచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ మీటర్ల ఖర్చు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన ఉత్తర్వులిచ్చింది. స్మార్ట్‌ మీటర్ల సరఫరాదారుని ఎంపిక ప్రక్రియ కూడా అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారమే పూర్తయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement