ప్రభుత్వ తీరును నిరసిస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్తు చార్జీలను తగ్గించకపోగా.. ప్రజలపై రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ భారం వేస్తారా?
అప్పులపైనా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతారా?.. ఇది మోసాల బడ్జెట్
సర్కారును మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్సార్‌సీపీ
విద్యుత్తు చార్జీల పెంపు, సూపర్ సిక్స్ హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్లిన శాసన మండలి
ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌట్
ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై చార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొత్స డిమాండ్
బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన పీడీఎఫ్.. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్న అధికార పక్షం
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది.
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్‌లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది.
విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు.
సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు.
ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు.
ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు.
అప్పులపై తప్పుడు ప్రచారం..
కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్‌లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది.
సూపర్ సిక్స్ ఎక్కడ?
సూపర్‌సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్‌లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా?
దిగజారిన శాంతి భద్రతలు..
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
ఔను.. ఒక్క సిలిండరే
ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు.
ఇమామ్, మౌజాన్‌లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు..
ఇమామ్, మౌజాన్‌లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు.
మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి
రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు.
బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్‌రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం.
మూజువాణితో ఆమోదం...
మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment