అంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల తిరుగుబాటు వేడి బాగానే తగులుతున్నట్లుంది. టీడీపీ జాకీమీడియా ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పెడుతున్న శోకండాలే దీనికి నిదర్శనం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు, ర్యాలీలు విజయవంతం కావడంతో టీడీపీ, దాని తోకమీడియాలిప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ప్రభుత్వంపై ఆరునెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అంచనాలను వైఎస్సార్‌సీపీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు దాన్ని ధ్రువీకరించింది. తమ కోడి కూయనిదే తెల్లవారదనుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ వార్తలను కప్పిపుచ్చేందుకు, గత ప్రభుత్వం పాలనే ఛార్జీల పెంపునకు కారణమంటూ బుకాయించే యత్నం చేసింది. కాకపోతే ప్రజలు తమకు కలిగిన నొప్పిని కూడా మరచిపోతారని అనుకుందీ ఎల్లో మీడియా! చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్న ఆలోచన, విచక్షణ లేకుండా ప్రజలుంటారా?
ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారమైతే కొట్టేశామని టీడీపీ, జనసేన, బీజేపీలు సంతోషించవచ్చు. తమ వంచన చాతుర్యానికి ఈనాడు, ఆంధ్రజ్యోతులు మురిసి పోతూండవచ్చు. అయితే ఇది ఎంతో కాలం నిలవదన్న విషయం ఈపాటికి వీరికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా స్వర్గంగా మారిందన్న భ్రమ కల్పించడానికి కూటమి, ఎల్లో మీడియా తంటాలు పడుతున్నాయి. తమ ఈ తాజా పాచిక పారడం లేదన్న విషయమూ వారికి స్పష్టమవుతోంది. మనసులోని ఆందోళనను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై ఏకంగా రూ. 15 వేల కోట్ల భారం పెట్టింది ప్రభుత్వం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది.
ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పంతా జగన్‌దే అని జాకీ పత్రిక నీచమైన కథనం ఇచ్చింది. ‘‘నాడు షాకులు ..నేడు శోకాలు’’ అంటూ హెడింగ్ పెట్టి, విద్యుత్ చార్జీల బాదుడు జగన్ దే అని నిస్సిగ్గుగా రాసింది. ఇది నిజమే అయితే చంద్రబాబుకు తాను విద్యుత్ చార్జీలు పెంచవలసిన అవసరం ఏమి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, వచ్చే ఏడాది సర్దుపోటు ఉందని ఎల్లో మీడియా చెబుతోంది. దానిని ఎవరైనా నమ్ముతారా? ఇది ఏ రకంగా జరుగుతుందో ఎక్కడైనా చెప్పారా? అంటే ఇప్పటికైతే నోరుమూసుకుని ఈ రూ.15 వేల కోట్లు చెల్లించాలని చెప్పడమే కదా? చంద్రబాబు టైమ్ లో పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.47 వేల కోట్ల బిల్లులను జగన్ పాలనలో చెల్లించారా?లేదా? అప్పుడు జగన్ ఏమైనా చంద్రబాబు నిర్వాకం గురించి ఏనాడైనా శోకించారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ జాకీ మీడియా గుక్కపెట్టి రోదిస్తోంది?
విద్యుత్తు సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు కాలం నుంచే సర్దుబాటు ఛార్జీల విధానం ఉందన్న విషయాన్ని మరచిపోయింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలుసు. ఇందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 30 శాతం మేర తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఆ తరువాత యాభై నుంచి వంద శాతం పెంచేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా ఈ పెంపునూ సమర్థించేందుకు జగన్‌పై నిందలేసే పనిలో పడ్డాయి. ఇచ్చిన హామీ ఎందుకు తప్పుతున్నారని మాత్రం ప్రశ్నించవీ పత్రికలు! ఆర్థిక, రాజకీయ సంబంధాల కారణంగానే ఎల్లో మీడియాకు ప్రజావసరాల కంటే సొంత ప్రయోజనాలే ఇలాంటి కథనాలు రాస్తున్నారని అనుకోవాలి.
చంద్రబాబు టైమ్‌లో అధిక రేట్లకు చేసుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రయత్నిస్తే... చంద్రబాబు, ఆయన జాకీ మీడియా కాని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని యాగీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా చౌకగా అంటే యూనిట్‌కు రూ.2.49లకే కొనుగోలు చేసినా దాన్ని ఈ మంద మెచ్చుకోలేదు సరికదా అభాండాలేసింది. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరుందంటూ తప్పుడు కథనాలు రాసింది. కేంద్రం సూచనల మేరకు రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని ఉరితాళ్లుగా అభివర్ణించిన ఎల్లోమీడియా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగిస్తూండటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. మీడియా ఇంత దుర్మార్గంగా మారితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండింది. కొంతమంది వైఎస్సార్‌సీపీ నేతలు ఆరు నెలలకే రోడ్లపైకి రావడమేంటని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు కూడా. టీడీపీ కూటమి కేసులు పెడుతుందన్న భయం దీనికి ఒక కారణమైంది. కానీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ఈ సమస్యపై ప్రజల గొంతుకయ్యారు. పార్టీకి కట్టుబడి ఉన్న నేతలు ధైర్యంగా బయటకు రావడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది.ఆరు నెలలుగా వైఎస్సార్‌సీపీని అణచి వేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీకి ఇది అశనిపాతమే. ఎల్లోమీడియా మాత్రం తనదైన శైలిలో వాస్తవాలను వక్రీకరించేందుకు తన వంతు ప్రయత్నం మానలేదు.
ఈ నేపధ్యంలోనే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి స్వాగతం పలుకుతున్నారు.ఎవరు నిజాయితీగా పాలన చేసింది ప్రజలు అర్దం చేసుకుంటున్నారనిపిస్తుంది. ధర్మవరం మీదుగా బెంగుళూరు వెళుతున్నప్పుడు ఆయా గ్రామాల వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభివాదం పలికి ఆయనతో సెల్పీలు దిగడానికి పోటీపడిన వైనం, జయ జయ ధ్వానాలు చేసిన తీరు ఆయన క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన విశ్వాసానికి ఇవన్ని దర్పణం పడుతున్నాయని చెప్పవచ్చు. ‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ అన్న చంద్రబాబు నినాదం అసలు అర్థం కాస్తా.. ‘బాబు ష్యూరిటీబాదుడు గ్యారంటీ’గా మారిపోయిందన్నమాట.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment