సాక్షి, బళ్లారి: ఎన్నికల ప్రచారంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీకి బలాన్ని నింపాయో అవే హామీలు ఇప్పుడు వెంటాడడం మొదలైంది. రాహుల్‌గాంధీ,ప్రియాంకగాంధీ, ఖర్గే, సిద్దు, శివకుమార్ తదితరులు రాష్ట్రంలో మూలమూలలా తిరిగి ఐదు హామీలను అమలు చేస్తామని, ప్రజలకు అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో గ్యారంటీ వాగ్దానాలను చేయడం తెలిసిందే.
దావణగెరె జిల్లాలో దండోరా
గ్యారంటీ హామీల్లో పేర్కొన్న కరెంటు చార్జీలు, బస్సు చార్జీలను ప్రజలు కట్టవద్దంటూ పలు జిల్లాల్లో వీడియాలు వైరల్ అవుతున్నాయి. రెండు రోజులుగా దావణగెరె జిల్లాలోని పలు గ్రామాల్లో... ఎవరూ విద్యుత్ బిల్లు కట్టవద్దని దండోరా వేస్తున్న వీడియా వైరల్ అయింది. అంతే కాకుండా మహిళలు కేఎస్‌ఆర్‌టీసీలో బస్సు చార్జీలు చెల్లించవద్దని పలుచోట్ల వాదనలు జరగడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని గ్రామాల్లో గ్యారంటీల అమలు కోసం దండోరా వేయిస్తున్నట్లు సమాచారం.
అమలు కోసం డిమాండ్లు
నేటి నుంచి ఎవరు కరెంట్ బిల్లు కట్టవద్దని, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఇద్దరు కరెంట్ బిల్లు కట్టవద్దని చెప్పారని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం అంటూ హామీ ఇచ్చారని మొదటి క్యాబినెట్ భేటీలోనే అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఐదు హామీలు ఇవే
ఇంటికి 200 యూనిట్ ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం, డిగ్రీ పూర్తి అయిన నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు, డిప్లొమా నిరుద్యోగికి రూ. 1500, గృహిణికి నెలకు రూ.2 వేలు భృతి, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి 10 కేజీల ఉచిత బియ్యం అనే ఐదు హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం, దానిపై నాయకులు ఇంటింటా ప్రచారం చేయడం తెలిసిందే. ఇప్పుడు అమలు చేయాలని డిమాండ్లు జోరందుకున్నాయి.
బనశంకరి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇంటింటికీ గ్యారంటీలను ఇవ్వడం సాధ్యం కాదని, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలను గుర్తించి ఈ పథకాల్ని అందిస్తామని ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహొళి తెలిపారు. ఆదివారం బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా బైలూరు గ్రామంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని, ఎన్నికల్లో మేము ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని చెప్పారు. గ్యారంటీ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. అందరికీ గ్యారంటీ పథకాలను ఇవ్వడానికి సమయం కావాలని, అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అయితే ఇంటింటికీ ఇవ్వలేమని, పేదలు, అర్హులను గుర్తించి వర్తింపజేస్తామన్నారు. బసవేశ్వరుని ఆదర్శాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment