ప్రతిష్టాత్మక ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్(డీఎంఐసీ) వల్ల పారిశ్రామిక ఉత్పాదకతలో ప్రపంచస్థాయిలో మహారాష్ట్రకు గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
ముంబై: ప్రతిష్టాత్మక ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్(డీఎంఐసీ) వల్ల పారిశ్రామిక ఉత్పాదకతలో ప్రపంచస్థాయిలో మహారాష్ట్రకు గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. వీటివల్ల 38 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, 2042 వరకు రూ.20 లక్షల కోట్లు అదనంగా పారిశ్రామిక ఉత్పత్తి వస్తుందని తెలిపారు. ఈ మేరకు పెట్టుడిదారులతో, రాష్ట్ర మద్దతు ఒప్పందాలపై ఆయన అధికారిక సంతకాలు చేసి తొలి దశ ప్రాజెక్ట్‌ను సోమవారం ప్రారంభించారు. తొలి దశలో అభివృద్ధి చేయనున్న షెంద్రే-బిదికిన్ పారిశ్రామిక నగరం కోసం రూ.17,319 కోట్లు పెట్టుబడి పెడతున్నామన్నారు.
ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, డీఎంఐసీ ట్రస్టు సంయుక్త భాగస్వామిగా ఏర్పడ్డాయన్నారు. ఇందులో 51 శాతం రాష్ట్రం భరిస్తుండగా, మిగిలిన 49 శాతాన్ని డీఎంఐసీ వెచ్చిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించి ఇస్తామని, కేంద్రం ఇచ్చే ఆర్థిక సహకారంతో ఒక్కో టౌన్‌షిప్‌కు రూ.3,000 కోట్లు వెచ్చించనున్నామని ఆయన వివరించారు. మిగతా డబ్బును తమ భాగస్వామి అయిన జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ భరిస్తుందని తెలిపారు. షెంద్రే-బిదికిన్ ప్రాజెక్ట్ వల్ల ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని వివరించారు. రాష్ట్రంలో సుమారు 29 శాతం భూమి పరిధిలో, 18 శాతం ప్రాజెక్ట్ ప్రభావ ప్రాంతంలో డీఎంఐసీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయన్నారు. ఎనిమిది జిల్లాల పరిధిలో ఉండే ఈ కారిడార్ కింద రాష్ట్ర జనాభాలో 26 శాతం మంది ఉంటారని తెలిపారు. వీటిలో ఠాణే, రాయ్‌గఢ్, పుణే, ధులే, నందూర్బార్, నాసిక్, అహ్మద్‌నగర్, ఔరంగాబాద్ జిల్లాలు ఉన్నాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ కూడా హాజరయ్యారు. కాగా, తొలి దశలో షెంద్రే-బిదికిన్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఔరంగాబాద్‌లో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్‌ను, కర్మద్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, షెంద్రేలో నీటి సరఫరా పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. రెండో దశలో ఢిల్లీ పోర్ట్ పారిశ్రామిక ప్రాంతం, ధులే మెగా పారిశ్రామిక పార్క్, నాసిక్-సిన్నార్-ఇగత్‌పురి పెట్టుబడి ప్రాం తం, అహ్మద్‌నగర్‌లో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్, గ్రీన్‌ఫీల్డ్ మెగా నగరంగా అభివృద్ధి చేయనున్నారు.
పనిచేస్తేనే పార్టీలో భవిష్యత్
పింప్రి, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో కలసి పనిచేసేవారికి రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని, పదవులను ఆశించకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పిలుపునిచ్చారు. పుణేలోని బాలేవాడి క్రీడా మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన రాజ్యసభ ఎంపీ సంజయ్ కాకడే సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చవాన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీ అధిష్టానం, నేతలతో స్నేహసంబంధాలు కలిగి ఉంటే రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు.
ఇందుకు మన ముందున్న కాకడేనే ఉదాహరణ అని అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా కృషిచేయడం వల్లే ఆయనకు పార్టీలో గుర్తింపు వచ్చిందని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ పాటిల్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, సామాజిక కార్యకర్త బాబా ఆడల్, సింబయోసిస్ సంస్థాపకులు మజుందార్, ఎమ్మెల్యేలు వినాయక్ నిమాణే, బచ్చు కడు, కమల వ్యవహారే, సూర్యకాంత్ కాకడే, నగరాధ్యక్షుడు అభయ్ ఛజేడ్, సత్కార సమితి అధ్యక్షుడు బాలాసాహెబ్ లాండ్గే తదితరులు హాజరయ్యారు.