కాంగ్రెస్ మల్లగుల్లాలు
Published Wed, Feb 26 2014 12:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొందామా..? లేదా ఒంటరిగా బరిలో దిగుదామా..! అని కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ మంతనాలతో బిజీ అయ్యారు. ఆశావహుల జాబితాను పెద్దలకు సమర్పించారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి డోలాయమానంలో పడింది. డీఎంకేతో జతకట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాల్లో ఉన్నా, ఇక్కడి నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. డీఎండీకేను కలుపుకుని ఎన్నికలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర నేతలు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఢిల్లీ పెద్దలు అపాయింట్‌మెంట్లు ఇవ్వక పోవడంతో డీఎండీకే నేత విజయకాంత్ అలిగి చెన్నైకు వచ్చేశారు. దీంతో కాంగ్రెస్‌ను దూరం పెట్టి బీజేపీతో దోస్తీకి అడుగులు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీ బలం ఏమేరకు ఉన్నదో ఆరా తీయడానికి ఢిల్లీ పెద్దలు సిద్ధమయ్యారు. హుటా హుటిన ఢిల్లీకి రావాలంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, శాసన సభా పక్ష నేత గోపినాథ్‌లకు ఆహ్వానం పంపించారు.
ఢిల్లీల్లో బిజీ : సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన జ్ఞాన దేశికన్, గోపినాథ్ మంగళవారం ఢిల్లీ పెద్దలతో మంతనాల్లో మునిగారు. పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్‌తో చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల ఆశావహుల నుంచి ఆహ్వానించిన దరఖాస్తుల్ని వారికి సమర్పించారు. 1200 మంది 40 స్థానాల్లో పోటీకి దరఖాస్తులు చేసుకున్నారని, వీరిలో అభ్యర్థిని ఎంపిక చేయాలని సూచించారు. ఆ జాబితాను సమగ్రంగా పరిశీలించిన పెద్దలు, అందులో కొందరి పేర్లను తొలగించి, ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి కొత్త జాబితాను సిద్ధం చేశారు. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలం, ఇది వరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలతో కూడిన నివేదికను జ్ఞాన దేశికన్ సమర్పించగా, దానిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. డీఎంకే, డీఎండీకేలతో కలసి పోటీ చేయాలా? లేదా కాంగ్రెస్ నేతృత్వంలో పోటీ చేయాలా? లేదా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాలా? అన్న కోణాల్లో మంతనాలు జరిపినట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
చర్చలకు రెడీ: డీఎంకే తమకు ఆహ్వానం పలికిన దృష్ట్యా, అధినేత్రి సోనియా గాంధీతో సమీక్ష అనంతంరం కరుణానిధితో చర్చకు రక్షణ మంత్రి ఆంటోని బృందాన్ని పంపించే రీతిలో ఇందులో నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. తొలుత ఆంటోని, అనంతరం చిదంబరం ద్వారా రాయబారాలు సాగించడంతో పాటుగా శ్రీలంక తమిళులకు మద్దతుగా కీలక నిర్ణయాన్ని రాబోయే రోజుల్లో తీసుకుని, తమిళుల మద్దతను కూడగట్టడం లక్ష్యంగా ఇందులో చర్చ సాగినట్టు తెలిసింది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో తీర్మానానికి తమిళులు పట్టుబడుతున్న అంశంపై పరిశీలన సాగినట్టు తెలుస్తోంది. ఆంటోని కమిటీ రంగంలోకి దిగిన తర్వాతే కూటమిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టిన పక్షంలో ఒంటరిగా కాంగ్రెస్ బరిలో దిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
Advertisement
Advertisement