కుష్బుపై ‘హస్తం’ కన్ను | Khushboo To Join Congress | Sakshi
Sakshi News home page

కుష్బుపై ‘హస్తం’ కన్ను

Published Sun, Jul 20 2014 11:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కుష్బుపై ‘హస్తం’ కన్ను - Sakshi

కుష్బుపై ‘హస్తం’ కన్ను

సాక్షి, చెన్నై: సినీరంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ కుష్బు తన సత్తాను చాటుకున్న విషయం తెలి సిందే. వాక్‌చాతుర్యం, అనర్గళంగా ప్రసంగించ డం, వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో దిట్ట. అయితే, ఆమెకు డీఎంకేలో సరైన గుర్తింపు రాలేదు. కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు డీఎంకేలో చివరకు మిగిలింది నిరాశే. ఎట్టకేలకు ఆ పార్టీ నుంచి బయట పడ్డ కుష్బు తన రాజకీయ పయనం ఎటో? అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఢిల్లీలోని మిత్రుల సహకారంతో బీజేపీలో ఆమె చేరబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. తమిళ మీడియా కోడైకూసినా, ఆమె మాత్రం ఖండించలేదు. దీంతో బీజేపీలో ఆమె చేరడం ఇక  ఖాయం అన్నట్టుగా ప్రచారం సాగింది. అయితే, రాష్ట్ర బీజేపీలో మహిళా నేతలకు, ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధిష్టానం ఇచ్చిన గుర్తింపును పరిగణనలోకి తీసుకుని కుష్బు వెనక్కు తగ్గినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 ఇదే అవకాశంగా తీసుకున్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ కుష్బును తమ వైపు తిప్పుకునేందుకు రెడీ అయ్యారు. గాలం : రాజకీయ అరంగేట్రం చేయనున్న తరుణంలో తొలుత కుష్బు చూపు కాంగ్రెస్ వైపు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆమె డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కుష్బును తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీఎన్‌సీసీ మళ్లీ రెడీ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా కసరత్తులు జరుగుతున్న వేళ తమకు సినీ గ్లామర్ అవసరమని జ్ఞాన దేశికన్ ఆలోచిస్తున్నట్లు సత్యమూర్తి భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో సరైన మహిళ నాయకులు ఎవ్వరూ లేని దృష్ట్యా, ఆ స్థానాన్ని కుష్బు ద్వారా భర్తీ చేయించి, కీలక బాధ్యతల్ని అప్పగించేందుకు సైతం రెడీ అయ్యారు. అయితే, ఇందుకు కుష్బుఅంగీకరిస్తారా? అన్న ప్రశ్న బయలుదేరింది.  
 
 రంగంలోకి కార్తిక్ : సినీ నటుడు కార్తిక్ , కుష్బు మంచి మిత్రులు. లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచార బరిలో కార్తిక్ దిగారు. తనకంటూ అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి ఉన్నా, కార్తిక్ కాంగ్రెస్‌తో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. ఇది జ్ఞాన దేశికన్‌కు వరంగా మారింది. కార్తిక్ సహకారంతో కుష్బును ఒప్పించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఆషాడం ముగియగానే కుష్బు వద్దకు కార్తిక్‌ను రాయబారిగా పంపించేందుకు రెడీ అయ్యారు. అంతలోపు కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ మద్దతు దారుడైన సినీ ప్రముఖుడు గజనాథన్ ద్వారా కుష్బుతో సంప్రదింపులకు ఏర్పాట్లు చేసినట్లు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 బాబిలోనాకు ఛాన్స్ : కుష్బు గుడ్ బై చెప్పడంతో డీఎంకేలో మహిళా సినీ గ్లామర్ కరువైంది. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి శృంగార తార బాబిలోన రెడీ అవుతున్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ రాజకీయ ప్రసంగాల్ని అమితంగా అభిమానిస్తానంటూ ఇది వరకు బాబిలోన ప్రకటించారు. తనకు రాజాకీయాలంటే ఇష్టం అని, తాను డీఎంకేలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తన సన్నిహితుల ద్వారా ఆ పార్టీ అధిష్టానానికి సంకేతాన్ని ఆమె పంపించారు. ఆషాడ మాసం అనంతరం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరడానికి బాబిలోన రెడీ అవుతున్నట్టు కోలీవుడ్‌లోను టాక్. దీన్ని బట్టి చూస్తే, ఆషాడం అనంతరం అటు కాంగ్రెస్‌కు, ఇటు డీఎంకేకు సినీ గ్లామర్లు దక్కనున్నారన్నమాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement