డీఎంకే కు ఖుష్బు గుడ్‌బై
సాక్షి, చెన్నై:అశేషాభిమాన లోకం హృదయం లో చెరగని ముద్ర వేసుకున్న నటి ఖుష్బు. ఈమెకు ఆలయాన్ని సైతం నిర్మించిన అభిమానులున్నారు. అయితే, అనవసరంగా నోరు జారి వివాదాల్లో ఇరుక్కోవడం ఈమెకు పరిపా టే. అదే సమయంలో మంచి వాక్చాతుర్యం, సమస్యలపై అవగాహన, పట్టు, ఆత్మ స్థైర్యం, నిక్కచ్చిగా మాట్లాడడం,సూటిగా ప్రశ్నించడం వంటి తత్వాలు ఆమెను రాజకీయాల్లోకి వచ్చే లా చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీ సభ్యురాలిగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు. తరువాత డీఎంకే కోశాధికారి స్టాలిన్‌తో విబేధాలున్నట్లు మీడియా కోడైకూసింది. ఇదే అంశాన్ని ఎత్తి చూపుతూ ఆమె ఇంటిపై దాడి జరిగింది. మరికొన్ని ఆరోపణలు వచ్చినా, ఖుష్బు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆమెను డీఎంకేలో అణగదొక్కుతున్నారంటూ మీడియాల్లో కథనాలు వచ్చినా, పార్టీకి తన సేవలందిస్తూనే వచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లోను పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాట సైతం పట్టిన ఖుష్బు సోమవారం ఉన్నట్టుండి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధినేత కరుణానిధికి లేఖ రాశారు. డీఎంకే నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించి, ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.వెళ్తున్నా...వెళ్తున్నా...: తనను కుటుంబంలో ఓ సభ్యురాలిగా గుర్తించినందుకు గాను తమిళనాడు ప్రజలకు సేవ చేయాలన్న కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చానని తన లేఖలో వివరించారు. సేవే లక్ష్యంగా డీఎంకేలోకి చేరానని గుర్తు చేశారు. తనకు పార్టీలో అప్పగించిన బాధ్యతలను వంద శాతం పూర్తి చేశానని, ఇది అందరికీ తెలుసునని పేర్కొన్నారు. తనకు కేటాయించిన అన్ని బాధ్యతల్ని ఆనందంతో, చిరునవ్వుతో పూర్తి చేసినా,
తన శ్రమ అంతా ఒకే మార్గంలో సాగుతున్నట్టు అనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రయాణం ఏమిటో అన్నది అంతు చిక్కక మనో వేదనకు గురయ్యానన్నారు. అందుకే బరువెక్కిన హృదయంతో డీఎంకే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తి స్థాయిలో తాను వైదొలగుతున్నానని ఖుష్బు ప్రకటించినా, తదుపరి తన కార్యాచరణ ఏమిటో? అన్నది ప్రశ్నార్థకంగానే మిగిల్చారు. మరో పార్టీలో రాజకీయ సేవను ఆమె కొనసాగిస్తారా లేదా, మళ్లీ సినిమాలు, లేదా టీవీ షోల్లో ప్రత్యక్షం కాబోతున్నారా..? అన్నది వేచి చూడాల్సిందే...!