తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధిలో నివాసం ఉండే చలపతి, నాగమణి దంపతుల కుమారుడు నవీన్. ఇతడు చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ నెల 5వ తేది అతడి పుట్టిన రోజు.
అయితే అతడు ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లాడు. అతడు ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందని అతడి తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేశారు. ఫలితం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం కాలేజీ సమీపంలోని నీటిగుంతలో శవమై పడి ఉన్నాడు.
ఆ విషయాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది... కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగానే స్నేహితులే తమ కుమారుడిని కొట్టి హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.