అమ్మ ప్రసంగంతో చెక్
♦ శశికళ కుటుంబీకులపై జయలలిత చేసిన విమర్శల సీడీలు విడుదల
♦ దినకరన్ ఆగడాలకు మంత్రి ఉదయకుమార్ అడ్డుకట్ట
♦ పుదుచ్చేరి క్యాంపు నుంచి జారుకున్న ఎమ్మెల్యేలు
♦ ఆరు జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం ఎడపాడి మంతనాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అంతర్గత కుమ్ములాటలోకి పార్టీ అధినేత్రి దివంగత జయలలితను కూడా దించారు. శశికళ కుటుంబం గురించి జయలలిత చేసిన విమర్శల సీడీలను మంత్రి ఉదయకుమార్ గురువారం విడుదల చేశారు. శశికళ, దినకరన్ జయలలిత చేత తిరస్కరింపబడిన వ్యక్తులుగా ప్రజల్లో ప్రచారం చేసేందుకు జయ మాట్లాడిన సీడీలను ప్రయోగించారు.
జయ మరణంతో ప్రత్యక్షంగా పార్టీ, పరోక్షంగా ప్రభుత్వం చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే అనతికాలంలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు శశికళ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేశాయి. తద్వారా పార్టీ బహిష్కరణకు దారితీశాయి. అయితే తమ చేతుల్లోని అన్నాడీఎంకేను సీఎం ఎడపాడి హైజాక్ చేశారని ఆగ్రహంతో ఉన్న దినకరన్ ప్రభుత్వాన్ని కూల్చేపనిలో నిమగ్నమయ్యారు. తమకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదన్న భావనతో ప్రతిపక్షాలతో టీటీవీ తెరవెనుక సంబం ధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలో శశికళ కుటుంబాన్ని తామే కాదు, గతంలో జయలలిత కూడా దూరం పెట్టారనే విషయాలను ప్రజలకు గుర్తు చేయాలని ఎడపాడి తలంచారు.
ఈ మాటలను జయ నోటి వెంట వస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందనే నిర్ణయంతో శశికళ కుటుంబం గురించి జయలలిత చేసిన విమర్శలతో కూడిన రెండు సీడీలను మంత్రి ఉదయకుమార్ గురువారం విడుదల చేశారు. 2011 డిసెంబర్ 30వ తేదీన పార్టీ సమావేశంలో జయలలిత చేసిన వ్యాఖ్యలు ఈ సీడీల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. 2013 నవంబర్ 10 వ తేదీన ఎడపాడి పళనిస్వామి ఇంటి వివాహ వేడుకల్లో జయ చేసిన ప్రసంగం ఉన్నట్లు చెప్పారు. జయలలిత హయాంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారంతా నేడు పార్టీలోకి ప్రవేశించి తగవులకు పాల్పడుతూ, పదవుల కోసం పాకులాడుతున్నారని ఈ సందర్భంగా మంత్రి ఉదయకుమార్ విమర్శించారు.
ఎమ్మెల్యేలతో సీఎం మంతనాలు:
ఇదిలా ఉండగా, మైనార్టీ సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు సీఎం ఎడపాడి నేరుగా రంగంలోకి దిగారు. తనకు మద్దతుగా నిలిచి ఉన్న ఆరు జిల్లాల ఎమ్మెల్యేలను గురువారం అత్యవసరంగా చెన్నైకి పిలిపించుకుని వేర్వేరుగా చర్చలు జరిపారు. ఎమ్మెల్యేలను సచివాలయంలో కలుసుకోవాలని సీఎం తొలుత భావించారు. అయితే ఆ తరువాత చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని తన ఇంట్లో కలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి విడతల వారీగా చర్చలు జరిపారు. విల్లుపురం జిల్లా ఎమ్మెల్యేలతో చర్చలు ప్రారంభించి వరుసగా కృష్ణగిరి, మదురై, తిరునెల్వేలి, తిరుచ్చిరాపల్లి, తిరువణ్ణామలై జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గురువారం ఎమ్మెల్యేలతో శుక్రవారం మాట్లాడనున్నారు.
సీఎం ఎడపాడితో జరిగిన చర్చల్లో ఎమ్మెల్యేలు పలుకోర్కెలను ఆయన ముందుం చినట్లు తెలుస్తోంది. ఎడపాడి బలపరీక్షకు ముందు కూవత్తూరు రిసార్టులో ఉన్నçప్పుడు ఇచ్చిన అనేక హామీలు నేటికీ నెరవేరలేదని వారు పట్టుబట్టినట్లు సమాచారం. అలాగే జూన్‌లో ఎమ్మెల్యేలు కలుసుకున్నపుడు చేసిన వాగ్దానాలు బుట్టదాఖలు చేశారని వారు వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని ఆడించడం, కూల్చడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదని సీఎం ఎడపాడి సవాల్ విసిరారు. మమ్మల్ని నమ్మిన వారు నష్టపోరని డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు.
దినకరన్‌కు షాక్
పుదుచ్చేరీ రిసార్టులో ఉన్న సుందరరాజ్, పార్థిబన్ అనే ఎమ్మెల్యేలు క్యాంపు నుంచి తప్పుకోవడం ద్వారా దినకరన్‌కు షాకిచ్చారు. ఎడపాడి ప్రభుత్వానికి 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరింపజేసిన దినకరన్ వారందరూ జారిపోకుండా జాగ్రత్తపడ్డారు. ఈ నెల 22 వ తేదీ నుంచి పుదుచ్చేరీలోని లగ్జరీ రిసార్టులో పోలీసు బందోబస్తు మధ్య బస ఏర్పాటు చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికతో దినకరన్ బలం 21కి పెరిగింది. ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని విపక్షాల కోర్కెను గవర్నర్ తిరస్కరించడంతో దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు నిరాశకు లోనయ్యారు. రిసార్టులో ఉండి ప్రయోజనం ఏమిటనే అభిప్రాయానికి కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు. వీరిలో కొందరు ఇళ్లకు వెళ్లిపోవాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలకు ఊతం ఇస్తూ ఎమ్మెల్యేలు సుందరరాజ్, పార్థిబన్ వేర్వేరుగా కార్లలో చెన్నైకి చేరుకున్నారు. దినకరన్, స్పీకర్లను కలుసుకునేందుకు వచ్చినట్లు సుందరాజ్ మీడియాకు తెలిపారు. రాజకీయ కల్లోలానికి రాష్ట్ర గవర్నరే కారణమని మాజీ స్పీకర్ సేడపట్టి ముత్తయ్య వ్యాఖ్యానించారు. బీజేపీ కనుసన్నుల్లో నడుచుకుంటూ వారి ఆదేశాలను పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే సీఎం ఎడపాడి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగ తమిళ్‌సెల్వన్ వ్యాఖ్యానించారు. కొంగుమండలానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలుకుతున్నారని దివాకరన్ చెప్పారు. తూత్తుకూడి జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి మంత్రి కడంబూరు రాజాను తొలగిస్తూ టీటీవీ దినకరన్ గురువారం ఆదేశాలు చేశారు.