
ఇరాన్ నుంచి వచ్చి... నకిలీ పోలీసు అవతారం ఎత్తి
బెంగళూరు : వృద్ధులను మోసగించి బంగారు నగలు లూటీ చేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తిని మహారాష్ట్రలోని ఠాణా జిల్లా మోమిన్‌పురకు చెందిన రహంతుల్లా సైఫుల్లా జాఫ్రీ అలియాస్ రహంతుల్లాగా గుర్తించారు. నిందితుడి నుంచి మూడు కేజీల రెండు వందల గ్రాముల బంగారు నగలు, జీపు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఇరాన్ దేశానికి చెందిన ఇతను బెంగళూరు చేరుకుని పోలీస్ అవతారం ఎత్తాడు. నగరంలోని పలు నిర్జన ప్రదేశాల్లో పోలీస్ దుస్తుల్లో సంచరిస్తూ ఒంటరిగా వెళుతున్న వృద్ధులను పలకరించి, పక్క వీధిలో భయానక వాతావరణం నెలకొందని, విలువైన ఆభరణాలు వేసుకుని వెళితే ప్రమాదమని బెదిరించేవాడు. నగలు తీసి బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లాలని సూచిస్తూ, వారిచేత బలవంతంగా నగలు తీయించి తానే పేపర్‌లో చుట్టి ఇచ్చేవాడు.
ఆ సమయంలో తన హస్తలాఘవంతో బంగారు నగలు అపహరించి, మహారాష్ట్రకు చేరుకుని విక్రయించి, జల్సాలు చేసేవాడు. ఈ తరహా కేసులు ఎక్కువకావడంతో రంగంలో దిగిన సీసీబీ పోలీసులు రహంతుల్లా అనుచరులు లాలా సమీర్ జాఫర్, ఉస్మాన్, గులాం, అబ్బాస్, లాలాను ఇటీవల అరెస్ట్ చేశారు. వీరు తెలిపిన ఆధారాల మేరకు రహంతుల్లాను బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 81 కేసులు నమోదయ్యాయి. అతని బృందంపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పది రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని సీసీబీ పోలీసులు తెలిపారు.