• సర్వ మత ప్రార్థనలు
• నేడు 25 వేల పాలబిందెలతో పూజ
• ఆసుపత్రి వద్ద నిరీక్షణ
అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురికావడం ఆ పార్టీ నేతలను తీవ్రంగా కలచివేస్తుండగా ఆమె కోలుకోవాలనే ప్రార్థనలతో ఆలయాలు నిండిపోతున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు హోరెత్తుతున్నాయి. అమ్మ ఆపోలో ఆసుపత్రికి చేరి 17 రోజులైంది. స్వల్ప అనారోగ్యమని తొలిరోజు ప్రకటించినపుడే తట్టుకోలేకపోయిన అమ్మ అభిమానులు రోజులు గడిచే కొద్దీ మరింత ఉద్వేగానికి గురి అవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రి పరిసరాలన్నీ అన్నాడీఎంకే నేతలతో నిండిపోతూ పార్టీ కార్యాలయాన్ని తలపిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే అపోలో వద్దకు చేరుకుని రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళా నేతలు, కార్యకర్తల అపోలో ప్రవేశద్వారం వద్ద తమకంటూ ఒకచోటును ఏర్పాటు చేసుకుని దీక్షలా కొనసాగుతున్నారు. ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం, వైద్య మంత్రి విజయభాస్కర్ తదితర మంత్రులు, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ ఆసుపత్రి వద్దనే గడుపుతున్నారు.
ప్రభుత్వ ప్రధాన రామమోహన్‌రావు ఒకవైపు సీఎం వైద్య చికిత్సను గమనిస్తూ, మరోవైపు రాష్ట్ర పరిపాలన కుంటు పడకుండా పాటుపడుతున్నారు. డిశ్చార్జ్ ఆలస్యం అయ్యే కొద్దీ అన్నాడీఎంకేలో ఆందోళన పెరిగిపోతోంది. అమ్మ కోలుకుంటోందని ఒకవైపు అపోలో ఆసుపత్రి, మరో వైపు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు ప్రకటి స్తున్నా ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీంతో అన్నాడీఎంకే శ్రేణులు సైతం మరింత ఉత్కంఠకు లోనవుతున్నారు. సీఎం కోలుకోవాలని ప్రార్థిస్తూ రాష్ట్రంలో సర్వమత ప్రార్థనలు సాగుతున్నాయి.
ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు జరుపుతున్నారు. తిరువళ్లూరు జిల్లా సమీపం కడంబత్తూ రు మండలం సిట్రం గ్రామంలోని శ్రీపచ్చైమలై ఆలయం లో శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేసి 108 మంది అన్నాడీఎంకే కార్యకర్తలు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరువొత్తియూరులోని ఆంజనేయస్వామి ఆలయంలో మహా యాగం చేశారు. చెన్నై తిరువల్లికేనీలోనిపార్థసారథి ఆలయంలో మంత్రులు కడంబూరు రాజా, సేవూరు ఎస్ రామచంద్రన్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధురైలో మంత్రి సెల్లూరు రాజా నేతృత్వంలో వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు.
సుమారు 50 మంది హిజ్రాలు ఆపోలో వద్దకు చేరుకుని అమ్మ కోసం అన్ని మతాల ప్రార్థనలు చేశారు. మధురై జిల్లా తిరుప్పరగున్రం మురుగన్ ఆలయంలో ఆదివారం 25 వేల పాల బిందెలతో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నందున పార్టీ శ్రేణులు దసరా పండుగను జరుపుకుంటున్న దాఖలాలు లేవు. పండుగ చేసుకున్న ఉత్సాహం కూడా లేనట్లుగా ఆసుపత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు.
స్టాలిన్ రాకతో సందడి
ప్రతిపక్ష నేత, డీఎంకే కోశాధికారి స్టాలిన్ శనివారం సాయంత్రం అపోలో వద్దకు రావడంతో సందడి నెలకొంది. కారులో నేరుగా ఆసుపత్రిలోపలికి వెళ్లిన స్టాలిన్ సుమారు అరగంటసేపు అక్కడే గడిపారు. సీఎంకు చికిత్స అందిస్తున్న వైద్యులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ, రెండురోజుల్లో సీఎం డిశ్చార్జ్ అవుతారని ప్రకటించిన అపోలో వైద్యులు రెండు రోజుల క్రితం సుదీర్ఘకాలం ఉండాలని పేర్కొనడంతో వచ్చినట్లు తెలిపారు. సీఎం జయలలితను నేరుగా చూసే అవకాశం లేదని తెలిసినా ఆమెకు చికిత్స అందిస్తున్న అపోలో వైద్యులను కలుసుకునేందుకు వచ్చానని అన్నారు. సీఎం త్వరగా డిశ్చార్జ్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
అమ్మ పేరిట మృత్యుంజయ యాగం
తిరువళ్లూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ తిరువళ్లూరులోని శ్రీ వైద్యవీరరాఘవస్వామి ఆలయంలో అన్నాడీఎంకే నేతలు మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరిణిలో బెల్లం, ఉప్పును కరిగిస్తే రోగాలు బెల్లంగా మారి కరిగిపోతాయన్న నమ్మకంతో ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. కాగా గత 18 ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేసి పుష్కరిణిలో పాలు, బెల్లం తదితర వాటిని వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సిరునియం బలరామన్ , ఎంపీలు వేణుగోపాల్, హరి, ఎమ్మెల్యేలు విజయకుమార్, నర్సింహన్, ఏలుమలై మాజీ మంత్రి రమణ, మాజీ ఎమ్మెల్యే మణిమారన్, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అమ్మ కోసం కొనసాగుతున్న పూజలు
పళ్లిపట్టు: అమ్మ క్షేమం కోసం అన్నాడీఎంకే శ్రేణులు ఆలయాల్లో పోటా పోటీగా పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమ అధినేత్రి ఆరోగ్యం కుదుట పడి యధావిధిగా బయటకు రావాలనే ఆశయంతో వారం రోజుల నుంచి అన్నాడీఎంకే శ్రేణులు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో తిరుత్తణి నియోజకవర్గ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జిల్లా ఆవిన్‌పాల్ చైర్మన్ వేలంజేరి చంద్రన్ అధ్యక్షతన మురుగన్‌కు విశిష్ట అభిషేక ఆరాధన పూజలు చేపట్టారు.
పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి బలరామ్, ఎంపీలు వేణుగోపాల్, హరి,ఎమ్మెల్యే నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మూలవమూర్తికి పూజలు చేపట్టిన అనంత రం ఉత్సవ మూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరిగించారు. అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. భారీ సంఖ్యలో అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొన్నాయి. అలాగే తిరుత్తణి పట్టణ అన్నాడీఎంకే ఉప కార్యదర్శి మాసిలామణి ఆధ్వర్యంలో గాంధీ రోడ్డు మార్గంలోని ధర్మరాజుల ఆలయం నుంచి 508 పాల బిందెల ఊరేగింపును మహిళలు నిర్వహించారు. ఇందులో జిల్లా కన్వీనర్ బలరామ్, ఎంపీలు హరి,వేణుగోపాల్, ఎమ్మెల్యే నరసింహన్, పట్టణ కన్వీనర్ సౌందర్‌రాజన్,పట్టణ పార్టీ అధ్యక్షుడు కుప్పుస్వామి,పార్టీ నాయకులు టీడీ.శ్రీనివాసన్, ఇళంగోవన్ తదితరులు పాల్గొన్నారు.
అవ్ము పేరుతో రాహుకేతు పూజలు
శ్రీకాళహస్తి : తమిళనాడు వుుఖ్యవుంత్రి జయులలిత ఆరోగ్యం కోసం అన్నాడీఎంకే నేత, పశుసంవర్థక శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి శనివారం శ్రీకాళహస్తి ఆలయంలో సర్పదోష, రాహుకేతు పూజలు చేరుుంచారు. రూ.5వేలు టికెట్ ద్వారా స్వామివారి సన్నిధి సమీపంలోని సహస్రలింగేశ్వరస్వామి వద్ద ప్రత్యేక పూజలు చేరుుంచారు. అనంతరం స్వామి, అవ్మువార్లను దర్శించుకున్నారు. జయులలిత ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయు ఆవరణలో కొబ్బరికాయులు కొట్టి, మొక్కులు తీర్చుకున్నారు. ఆయునతో పాటు పలువురు అన్నాడీఎంకే నేతలు ఉన్నారు.
అమ్మ కోసం.. ఆలయాల్లో పూజలు
Published Sun, Oct 9 2016 1:33 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
Advertisement
Advertisement