మాకూ ఉద్యోగాలివ్వాలి
మాకూ ఉద్యోగాలివ్వాలి
Published Sat, Oct 8 2016 2:59 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
ట్యాంకులు, టవర్లు ఎక్కిన వీఆర్‌ఎస్ డిపెండెంట్లు
బెల్లంపల్లి, గోదావరిఖనిలో డిస్మిస్డ్ కార్మికులు సైతం..
సింగరేణి మూడు రీజియన్లలో ఉద్రిక్త పరిస్థితులు
గురువారం రాత్రి నుంచే ఆందోళనలు
గోదావరిఖని/రుద్రంపూర్/మందమర్రి/బెల్లంపల్లి : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే 1997 నుంచి 2001 వరకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్‌ఎస్) ద్వారా ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల్లో రూ. 2లక్షలు కాంపెన్షేషన్ తీసుకోని వారికి సైతం ఉద్యోగావకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తమకు కూడా ఉద్యోగాలి వ్వాలని కాంపెన్షేషన్ పొందిన కార్మికుల వారసులు కం పెనీ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. గోదావరిఖనిలో గురువారం రాత్రి 10.30 గంటలకు డిపెండెంట్లు లక్ష్మారె డ్డి, సతీష్‌యాదవ్, రమేశ్, రామరాజు, రవీందర్, యూ సుఫ్ అశోక్‌నగర్‌లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి 21 గంటలపాటు అక్కడే ఉన్నారు. సమస్యను సీఎండీ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని శుక్రవారం ఎంపీ బాల్క సుమన్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగెర్ల మల్లయ్య ప్రకటించారు. ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌లో మాజీ ఎంపీ జి.వివేక్ సైతం హామీ ఇవ్వడంతో డిపెండెంట్లు ఆందోళన విరమించి కిందకు వచ్చారు.
మందమర్రిలో..
మందమర్రిలో 150 మంది వీఆర్‌ఎస్ డిపెండెంట్లు ఆం దోళనకు దిగారు. కొందరు శుక్రవారం ఉదయం 9.00 గంటలకు యాపల్‌లోని మున్సిపల్ నీటి ట్యాంక్ ఎక్కా రు. స్పష్టమైన హామీ ఇస్తేనే కిందకు వస్తామని చెప్పడం తో పోలీసులు సైతం మిన్నకుండిపోయారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నచ్చజెప్పినా వినలేదు. ఎట్టకేలకు సాయంత్రం 8.00 కిందకు దిగి వెళ్లిపోయా రు. అంతకు ముందు వీఆర్‌ఎస్ నాయకులు రమణాచా రి, శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే తమ బతుకులు బగుపడుతాయని ఆశపడితే ఇప్పుడు తిరకాసుతో అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్‌ఎస్ వారసులకు ఉద్యోగాలివ్వకుంటే ప్రత్యక్ష పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వీఆర్‌ఎస్‌లు చేస్తున్న ఆందోళ న న్యాయమైనదేనని కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేష్, నూకల రమేష్ వారికి మద్దతు తెలిపారు. ఆందోళనలో వీఆర్‌ఎస్ డిపెండెంట్లు కోత్తపల్లి రమేష్, సజ్జనపు సదానందం, కూకట్ల తిరుపతి, మెండె భాస్కర్, నాగరాజు, సింగరేణి శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో..
కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా వీఆర్‌ఎస్ డిసెండెంట్లు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ ఇల్లందుకు చెందిన బద్రునాయక్, సంతోష్, కొత్తగూడెం రామవరంకు చెం దిన చేనెళ్లి రమేష్ బర్మాక్యాంప్‌లోని రామాలయం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు దిగేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసికట్టుగా తమకు అన్యా యం చేసిందని, వీఆర్‌ఎస్, డిపెండెంట్, డిస్మిస్డ్ కార్మికులందరికీ ఒకే దఫా ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సాయంత్రం 7.00 గంటలకు ఆందోళన విరమించారు.
Advertisement