రాష్ట్రంలో మద్యంపై పోరు మిన్నంటింది. అధికార పక్షం మినహా అన్ని పక్షాలు ఏకమయ్యాయి. టాస్మాక్ దుకాణాలను వరుసపెట్టి ధ్వంసం చేసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం బానిసలు, మద్యం మత్తులో ఆగడాలు రాష్ట్రంలో రోజురోజుకూ అధికం అవుతున్నాయి. నడివయస్సు వారికే పరిమితమైన మద్యం ఇటీవల విద్యార్థినీ విద్యార్థులు కలిసి తాగే స్థాయికి చేరుకుంది. అంతేగాక ముక్కుపచ్చలారని ఐదారేళ్ల బాలురు సైతం మద్యం తాగుతూ వాట్సాప్‌లో దర్శనం ఇచ్చారు. మద్యం అమ్మకాలను రాష్ట్రప్రభుత్వమే నిర్వహిస్తున్న కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత బయలుదేరింది. మహిళలు టాస్మాక్ దుకాణాలను అడ్డుకోవడం ప్రారంభించారు. ఈ దశలో సేలం జిల్లా ఇళంపిళ్లై గ్రామానికి చెందిన గాంధేయవాది శశిపెరుమాళ్ టాస్మాక్ దుకాణాలను మూసివేయాలని డిమాండ్‌పై సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఆగ్రహంతో భగ్గుమంది.
విద్యార్థుల ఆమరణదీక్షలు: శశిపెరుమాళ్ మృతదేహాన్ని ఆయన కుటుంబీకులు స్వాధీనం చేసుకోకుండా ఆందోళన బాట పట్టడంతో ప్రజలు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు సమైక్యమై ఆందోళనబాట పట్టారు. శవాన్ని తీసుకోవాల్సిందిగా సోమవారం సైతం అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మద్రాసు యూనివర్సిటీ విద్యా ర్థులు రాజకుమార్, జయప్రకాష్, సునీల్‌కుమార్ సోమవారం ఆమరణదీక్ష ప్రారంభించారు. మద్యనిషేధం విధించడమో, తమ ప్రాణాలు విడవడమే తేలిపోవాలని వారు చెబుతున్నారు. తాంబరం బస్‌స్టేషన్ వద్ద కంచి చట్టపంచాయిత్ నిర్వాహకులు దేవేంద్రన్ నాయకత్వంలో సోమవారం నిరాహారదీక్షలు చేపట్టారు. అనుమతి లేదన్న కారణంగా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చోళవరం ఎంజీఆర్ నగర్‌కు చెందిన మది (28) అదే ప్రాంతంలోని టాస్మాక్ దుకాణం ఎత్తివేయాలని కోరుతూ సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మదిని అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. మద్యం బాబుల చైతన్య సంఘం వారు నందనం కూడలిలోని దేవర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై పచ్చయప్పన్ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు పూందమల్లి కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. టాస్మాక్ దుకాణాల నుంచి మద్యం బాటిళ్లలను తెచ్చి రోడ్లపై పగులగొట్టారు. విద్యార్థి నేతలతో చర్చలు విఫలం కాగా లాఠాచార్జీ చేసి చెదరగొట్టారు. శంకర్‌కోవిల్ సమీపం నడువికురిచ్చి గ్రామ ప్రజలు తెల్లవారుజామునే టాస్మాక్ దుకాణాన్ని ముట్టడించి తెరవకుండా చేశారు.
ఇలా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో టాస్మాక్ దుకాణాలను మూసివేయాలనే ఆందోళనలు సాగాయి. సేలం పనంగాడు ప్రాంతంలో ఉన్న టాస్మాక్ దుకాణానికి గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున నిప్పుపెట్టారు. పోలూరు నామ్ తమిళర్ కట్చికి చెందిన ఇద్దరు కార్యకర్తలు కందన్ (26), అక్సర్‌బాషా(27) పోలూరు చింతాద్రిపేటలోని సెల్‌టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. మద్య నిషేధం విధించాలని కోరుతూ నినాదాలు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పికిందికి దించారు. కోవై పట్టనంపుదురైకి చెందిన పాల్‌రాజ్ (40) అనే కాంగ్రెస్ నేత, శశికుమార్ (35), సంతోష్ (30)లతో కలిసి అదే ప్రాంతంలోని 160 అడుగుల ఎత్తున్న సెల్‌టవర్ ఎక్కారు. అధికారులు పైకి వస్తే దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.
కోవై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వీఎంసీ మనోహరన్ తన అనుచరులను సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించి కిందికి దింపారు. చెన్నై పచ్చయప్ప కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు కీల్‌పాక్‌లో కాలేజీ వెనుకనున్న వైద్యనాథన్ రోడ్డులో అకస్మాత్తుగా రాస్తారోకోకు దిగారు. కొందరు విద్యార్థులు అక్కడికి సమీపంలోని ఒక టాస్మాక్ దుకాణంలోకి చొరబడి ధ్వంసం చేశారు. శశిపెరుమాళ్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందే దీక్షలు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లోని 1400 టాస్మాక్ దుకాణాలను మరోప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సెల్‌టవర్ తరంగాలు ప్రాణాంతకం: ప్రొఫెసర్
మనుషులు సెల్‌టవర్ ఎక్కడం ప్రాణాంతకానికి దారితీస్తుందని అన్నావర్సిటీ మాజీ ప్రొఫెసర్ పీకే పళనిస్వామి హెచ్చరించారు. సెల్‌టవర్‌లోని ధ్వనితరంగాల తాకిడితో రక్తం అత్యంతవేడెక్కి తీవ్రరక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు. సాధారణ సెల్‌ఫోన్ వల్లనే మనిషికీ కీడు కలుగుతున్న తరుణంలో అత్యంతశక్తిమంతమైన్ సెల్‌టవర్‌కు చేరువకావడం వల్ల మరెంత ప్రమాదం ఉంటుందో తెలుసుకోవాలని కోరారు.
మిన్నంటిన మద్యం పోరు
Published Tue, Aug 4 2015 4:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement
Advertisement