ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: ముంబయి శివారులోని థానే జిల్లా భీవాండిలోని ఓ వస్త్ర పరిశ్రమలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయిదు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు వేగంగా పై అంతస్థులకు పాకాయి. దుస్తులు వేగంగా మంటలకు ఆహుతై మొత్తం నాలుగు ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకుంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించిన బీఎంసీ అధికారులు, పోలీసులు .. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీలో ఉదయం షిఫ్ట్‌లో పని చేస్తున్న 80 మంది ఫ్యాక్టరీ పైకప్పు మీదకు చేరుకుని తమనకు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీతో పాటు నివాస కాంప్లెక్స్ అయినందున కార్మికులే కాకుండా మరో 70 మందికి పైగా మంటల్లో చిక్కుకుపోయారు. అయితే చిక్కుకున్నవారు 150మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
భీవాండి అగ్ని ప్రమాదంపై తెలంగాణ జిల్లాల చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. భీవాండి పరిసర ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల చేనేత కార్మికులే పని చేస్తుంటారు. కాగా ఈ ఫ్యాక్టరీకి ఒకే ద్వారం వున్నందున లోపలి కార్మికులను బయటకు తరలించే అవకాశం లేదు. కేవలం నిచ్చెనల ద్వారా లేదంటే హెలికాప్టర్ల ద్వారా కార్మికులను సురక్షితంగా కిందకు దించే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.