ముంబై పరేల్‌లోని బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం, జెన్ సదావర్తే
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ నివాస సముదాయంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దాదర్ ప్రాంతంలో ఉన్న క్రిస్టల్ టవర్ అనే 17 అంతస్తుల భవనంలో ఉదయం 8.32 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో నలుగురు మరణించగా, 16 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారికి ఎలాంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 12వ అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా అంతస్తులకు దావానలంలా వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ బ్రిగేడ్ కంట్రోల్ రూమ్‌కు సందేశం అందింది. సమాచారం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. లిఫ్టులు, మెట్లదారి నుంచి ప్రజలను కాపాడటం సురక్షితం కాదని భావించిన అధికారులు నిచ్చెనల సాయంతో వారిని కిందకు దించారు. ఇంకా కొంత మంది భవనంలోనే ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. మొత్తం 10 ఫైరింజన్లు, 4వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలు ఆర్పామని చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
ఆపదలో ఆదుకున్న చిన్నారి చిట్కాలు
సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడున్న వారంతా భయంతో వణికిపోతారు.అదే అగ్ని ప్రమాదాల్లాంటివయితే చావు భయంతో తోపుళ్లు, తొక్కిసలాటలతో పరిస్థితి భయానకంగా మారుతుంది.అయితే, ముంబైలోని క్రిస్టల్ టవర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల అమ్మాయి ఎంతో ధైర్యంగా వ్యవహరించి ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడింది. జెన్ సదావర్తే అనే ఆ బాలిక అగ్ని ప్రమాదం కారణంగా వెలువడిన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారికి చిన్న చిట్కాతో ఉపశమనం కలిగించింది.పొగకు ఫ్లాట్లలోని జనమంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంటే జెన్ వాళ్లకి ధైర్యం చెప్పింది. తడి గుడ్డను ముక్కుకు కట్టుకుంటే పొగలోని కార్బన్‌డయాక్సెడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు.అని చెప్పింది.
అంతే కాకుండా అందుబాటులో ఉన్న పాత బట్టల్ని తీసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా(జేబురుమాళ్ల సైజులో)చింపింది. వాటిని తడిపి అందరికీ ఇచ్చి ముక్కుకు కట్టుకోమని చెప్పింది. అంతా అలా చేసి కార్బన్ డయాక్సైడ్ బారి నుంచి బయటపడ్డారు. అలాగే, లిఫ్టులో కిందకి దిగకూడదంటూ వారిని వారించింది. తన దగ్గరున్న ఎయిర్ ప్యూరిఫయర్‌ను కూడా అందరికీ ఇచ్చింది.అలాగే అందరూ ఒకేసారి మెట్ల మీదుగా తోసుకుంటూ కిందకి వెళితే జరిగే ప్రమాదాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చెప్పింది. ఇవన్నీ విపత్తు నిర్వహణకు సంబంధించి తన స్కూల్‌లో చేసిన ప్రాజెక్టు వల్ల నేర్చుకున్నానని తరువాత మీడియాకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment