విరామం
Published Tue, Apr 15 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
చేపల వేట నిషేధకాలం అమల్లోకి వచ్చింది. చేపల వేటకు నెలన్నర రోజులు విరామం లభించినట్టు అయింది. ఈ కాలంలో వలలు, పడవలను మరమ్మతులు చేసుకునేందుకు జాలర్లు సిద్ధం అవుతున్నారు. నిషేధ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీలంకతో చర్చలు త్వరితగతిన ముగించాలని జాలర్ల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
సాక్షి, చెన్నై:సముద్రంలో మత్స్య సంపదను పెంచడం లక్ష్యం గా ప్రతి ఏటా చేపల వేటకు విరామ కాలం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. చేపల వృద్ధి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 15 నుంచి మే 29 వరకు ఈ నిషేధా న్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ కాలంలో రాష్ట్రంలోని 13 సముద్ర జిల్లాల్లోని జాలర్లు చేపల వేటకు దూరంగా ఉండాల్సిందే. ఈ సమయంలో వీరికి జీవన భృతిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తున్నది. దీంతో జాలర్లు తమ పడవలను సిద్ధం చేసుకోవడం, వలలను అల్లుకోవడం తదితర పనుల్లో నిమగ్నం అవుతారు. మర, అతిపెద్ద మోటార్ బోట్లపై నిషేధం ఉన్నా, ఫైబర్, చెక్క పడవలు ఒడ్డు నుంచి 20 కి.మీ వరకు సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. దీంతో ఈ కాలంలో చేపల ధరలకు రెక్కలు తప్పదు.
అమల్లో నిషేధం : సోమవారం అర్ధరాత్రి నుంచి నిషేధ కాలం అమల్లోకి వచ్చింది. దీంతో సముద్రంలోకి వెళ్లిన మర, అతి పెద్ద పడవలు, మోటార్ బోట్లు ఒడ్డుకు బయల్దేరాయి. ఇక, ఆదివారం రాత్రి ఒడ్డుకు చేరుకున్న జాలర్లు ఉదయం నుంచి సముద్రంలోకి తిరిగి వెళ్ల లేదు. నిషేధ కాలం అమల్లోకి రావడంతో రాష్ట్రంలోని కన్యాకుమారి, రామేశ్వరం, నాగర్‌కోయిల్ , తూత్తుకు డి, కడలూరు, నాగపట్నం, చెన్నై తదితర 13 సముద్ర తీర జిల్లాల్లోని జాలర్లకు చెందిన వేలాది పడవలు ఒడ్డుకే పరిమితం అయ్యాయి. తమ పడవలను సురక్షితంగా ఉంచుకోవడంతో పాటుగా, వాటికి చేయాల్సిన మరమ్మతులు, వలల అల్లికల్లో నిమగ్నం అయ్యేందుకు జాలర్లు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో సుమారుగా 14 వేల మర పడవలు, 20 వేల అతి పెద్ద మోటార్ పడవలు కడలిలోకి వెళ్లలేదు. ఈ దృష్ట్యా, జాలర్లతో పాటుగా ఐస్ ఉత్పత్తి సంస్థలకు నెలన్నర రోజులు కష్ట కాలమే. అదే సమయంలో చిన్న చిన్న చెక్క, ఫైబర్ పడవలు ఒడ్డు నుంచి 20 కి.మీ దూరం చేపలను వేటాడుకునే అవకాశం ఉండడంతో ఆ పడవల దారులు వేటకు రెడీ అయ్యారు. అయితే, వీరు చిన్నా, చితక చేపలను మాత్రమే తీసుకువస్తారు. దీంతో ఈ నెలన్నర కాలం చేపల ధరకు రెక్కలు తప్పదు.
చర్చలకు విజ్ఞప్తి : నిషేధ కాలం అమల్లోకి వచ్చిన దృష్ట్యా, ఇప్పటికైనా శ్రీలంకతో చర్చలకు చర్యలు తీసుకోవాలని జాలర్ల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక చేపల వేటకు కడలిలోకి జాలర్లు వెళ్లబోరని, ఈ దృష్ట్యా, చర్చలకు ఈ సమయం అనుకూలంగా పేర్కొంటున్నారు. ఈ నెలన్నర రోజులను సద్వినియోగం చేసుకుని, రెండు దేశాల మధ్య కీలక నిర్ణయాలు తీసుకోవాలని, సముద్రంలో చేపల వేటలో ఉండే తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిషేద కాలంలో తమకు రూ.1200 చొప్పున పరిహారం ఇస్తున్నారని, దీనిని రూ.మూడు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళల్లో నిషేధ కాలంలో జాలర్లకు ఏ విధంగా రేషన్ వస్తువుల్ని ఉచితంగా అందజేస్తున్నారో, అదే విధంగా తమకు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement