నిరసనల హోరు..!
తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. అవనీయాపురం, పీలమేడు, పెరంబలూరు, కాంగేయం గ్రామాల్లోని ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. దుకాణాలన్నీ మూతపడ్డాయి. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయూలంటూ ఒత్తిడి పెరుగుతుండడంతో ఐఏఎస్‌ల బృందం ఢిల్లీకి పరుగులు తీసింది. జల్లికట్టుకు ప్రసిద్ధిగాంచిన అలంగానల్లూరులో ఎలాగైనా నిర్వహించాలన్న సంకల్పంతో నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సాక్షి, చెన్నై: తమిళ సంప్రదాయ, సాహస క్రీడగా జల్లికట్టు పేరెన్నిక గన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా జల్లికట్టు క్రీడల నిర్వహణ అనేక అడ్డంకుల్ని ఎదుర్కొంటోంది. అయితే, ఈ ఏడా ది జల్లికట్టు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించడంతో, రాష్ట్రంలో ఆందోళన బయల్దేరింది. సంక్రాంతి పర్వదినాల్లో సాగే తమ సంప్రదాయ, సాహస క్రీడకు అడ్డంకులు సృష్టించ వద్దని వేడుకునే పనిలో తమిళులు పడ్డారు. ఇందుకు సుప్రీంకోర్టు కరుణించ లేదు. దీంతో ఎలాగైనా తమకు అనుమతి ఇప్పించాలని కోరుతూ రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. పండుగ సమీపిస్తుండడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక అనుమతి ఇప్పించాలని, లేని పక్షంలో అత్యవసర చట్టం తీసుకురావాలని రాష్ట్రాన్ని డిమాండ్ చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
ఇందుకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ చర్యల్ని వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఐఏఎస్ అధికారుల బృందాన్ని రంగంలోకి దించింది.ఢిల్లీకి పరుగు : ఐఏఎస్ అధికాారులు విజయకుమార్, అయూబ్‌ఖాన్, అభిరాగం నేతృత్వంలోని బృందం ఉదయాన్నే ఢిల్లీకి పరుగులు తీసింది. ఢిల్లీకి కేంద్ర అటవీ, జంతు సంరక్షణ విభాగం అధికారులతో ఈ బృందం సంప్రదింపుల్లో పడింది. వన్య ప్రాణుల్లో వినోదానికి ఉపయోగించే జంతువుల జాబితా నుంచి ఎద్దుల్ని తొలగించాలని, కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ జల్లికట్టు నిర్వహించుకునే విధంగా తమిళనాడు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చే అధికారం ఇవ్వాలని విన్నవించే పనిలో పడ్డారు. ఇందుకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనన్న ఉత్కంఠతో జల్లికట్టు నిర్వాహకులు ఎదురు చూపుల్లో పడ్డారు.
అలాగే, తమ డిమాండ్‌ను, తమ మనోభావాలను వెలికి తీసుకొచ్చే విధంగా ఉదయం నుంచి దక్షిణాదిలోని అనేక జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు. స్వచ్ఛందంగా బంద్: జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని లేదా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జల్లికట్టు నిర్వహణను సులభతరం చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు హోరెత్తాయి. తమ సంప్రదాయాల్ని గౌరవించాలని, తమ మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని నిరసనకారులు గళం విప్పారు. మదురై జిల్లా అవనీయాపురం, పీలమేడుల్లో బంద్ వాతావరణం నెలకొంది. స్వచ్ఛందంగా దుకాణాలన్నీ మూతబడ్డాయి. ఇళ్ల మీద నల్ల జెండాల్ని ఎగుర వేశారు. అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పెరంబలూరులో జల్లికట్టు క్రీడాకారులు తమ ఎద్దులతోపాటుగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో వినతి పత్రం సమర్పించారు.
శివగంగై, దిండుగల్, కోయంబత్తూరు జిల్లా కాంగేయంలలోను నిరసనలు హోరెత్తాయి. తమ మనోభావాలకు అనుగుణంగా నడుచుకుని జల్లికట్టుకు అనుమతి ఇవ్వని పక్షంలో మంగళవారం భారీ ఎత్తున నిరసనలకు నిర్ణయించారు. జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన అలంగానల్లూరులో తాడో పేడో తేల్చుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని, సుప్రీం కోర్టు సైతం స్పందిస్తుందన్న ఆశాభావంతోనే తాము ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేయడం గమనార్హం. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. తమిళుల సంప్రదాయాల్ని గౌరవించాలని, గతంలో తమ ప్రభుత్వం తీసుకున్నట్టుగానే కీలక నిర్ణయం తీసుకుని జల్లికట్టు నిర్వహణకు మార్గం సుగమం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కోళ్ల పందేలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించింది.